– ఎసిఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్
– మంగళగిరి క్రికెట్ స్టేడియంలో స్పోర్ట్స్ సెంటర్
– రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ అకాడమి ఏర్పాటు
– ఎపిని క్రీడాంధ్రప్రదేశ్ చేయటమే ప్రభుత్వ లక్ష్యం
– బ్యాడ్మింటన్ టోర్నమెంట్ -2024 ఫైనల్ విజేతలకు బహుమతి ప్రదానం
విజయవాడ : గత ప్రభత్వం క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. రాష్ట్రంలోని స్టేడియాలను నిరుపయోగంగా మార్చేసింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మారుమూల పల్లెలో వున్న నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీసేందుకు క్రికెట్, బ్యాడ్మింటాన్, వాలీబాల్, కబాడీ లాంటి అన్ని క్రీడలకి సంబంధించి టోర్నమెంట్స్ నిర్వహించబోతున్నామని విజయవాడ ఎసిఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నమెంట్స్ డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 15 వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
విజయవాడలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్డేడియం లో యోనెక్స్ సన్ రైజ్ నాగబాబు మెమోరియల్ నిర్వహించిన ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ -2024 విజేతలకు బహుమతి ప్రదానం చేసేందుకు ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు తో కలిసి పాల్గొన్నారు. అండర్ -17 బాయ్స్ డబుల్ ఫైనల్స్ ఆడే క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం మ్యాచ్ ఆసక్తి తిలకించారు. ఈ మ్యాచ్ లో గెలిచిన బాల ప్రణయ్ ప్రగడ, ప్రణీత్ సోమానికి విన్నర్ కప్ అందించారు.
ఈసందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృషి జరుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం క్రీడాంధ్ర ప్రదేశ్ గా మారనుందన్నారు. 2027లో రాష్ట్రానికి నేషనల్ గేమ్స్ రానున్నాయన్నారు. త్వరలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతుందని తెలిపారు.
ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ తరుఫున అన్ని క్రీడాలను ప్రొత్సాహించాలనే ఉద్దేశ్యంతో వున్నామని స్పష్టం చేశారు. ఇండియా క్రికెట్ టీమ్ లో బాగా రాణించిన నితీష్ రెడ్డిని అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ తో వున్న క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజయవాడ, విజయనగరం, అనంతపురం ప్రాంతాల్లో మెన్స్ కి, గుంటూరులో లేడీస్ క్రికెట్ అకాడమిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో అన్ని క్రీడలకి సంబంధించి త్వరలో స్పోర్ట్స్ సెంటర్ నిర్మించబోతున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ అంకం చౌదరి, శాప్ బ్యాడ్మింటన్ కోచ్ కె.భాస్కర్, టిడిపి నాయకులు మాదిగాని గురునాథం, నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.