ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
కోటప్పకొండ, మహానాడు: రాష్ట్రం ఆర్థిక అగాథం నుంచి బయటపడాలని విశిష్ఠ తొలి ఏకాదశి పూజల సందర్భంగా ఆ విష్ణు మూర్తిని వేడుకున్నట్లు తెలిపారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రానికి శాపంగా మారిన వైకాపా పాపాల నుంచి విముక్తి లభించాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, సంపదలతో నిండాలని ఆ దేవుడిని కోరుకున్నానన్నారు. ఆ చల్లని కృపతో రాష్ట్ర ఆర్థిక కష్టాలు తీరి, అభివృద్ధి పరుగులు తీయాలని. ప్రజలందరికి ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు చెప్పారాయన.
బుధవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని ప్రత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కొండ దిగువన ఉన్న కాకతీయ సత్రంలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, కూటమి ప్రభుత్వంపై మెండుగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష అన్నారు. ధర్మం పాటించే, గౌరవించే పాలనలో తప్పకుండా కోరిన కోరికలు తీరతాయనే నమ్మకంతో ఉన్నామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, బ్రాండ్ ఏపీ బలోపేతం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని ప్రత్యేకంగా కోరుకున్నట్లు ఆయన తెలిపారు.