జిల్లాకో ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు దిశగా అడుగులు

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం

‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతాం

టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయం వేదికగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోం మంత్రి వంగలపూడి అనిత

అమరావతి, అక్టోబర్, 03; డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. జిల్లాకు ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయం వేదికగా గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోం మంత్రి మాట్లాడుతూ ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను మరింత పెంచుతామన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా గంజాయి సాగు, మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు.

డ్రోన్లు, శాటిలైట్లు,జీపీఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీల వినియోగంతో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించే కార్యాచరణ రూపొందిస్తామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. వ్యూహాత్మక చెక్ పోస్టులు, హాట్ స్పాట్ లు, ప్రత్యేక ఎన్డీపీఎస్ బీట్లను ఏర్పాటు చేసి తద్వారా గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టే చర్యలు చేపడతామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి గంజాయి రవాణా ఆచూకీ చెప్పి పట్టిస్తే ప్రభుత్వం తరపున రివార్డులు అందజేస్తామని హోం మంత్రి వివరించారు. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన గంజాయి రక్కసిని అంతం చేయడమే లక్ష్యంగా విధివిధానాలు రూపొందించేందుకు గల అన్ని అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించిందన్నారు.

మందు, డ్రగ్స్ వల్ల గత ప్రభుత్వంలో రెట్టింపైన ఆత్మహత్యలు
మందు, డ్రగ్స్ వల్ల గతంలో ఎన్నడు లేని విధంగా గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని హోంమంత్రి వెల్లడించారు.ఎన్ఆర్ సీబీ-2020 లెక్కల ప్రకారం దేశంలో డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకుని ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్యలో ఏపీ ఐదో రాష్ట్రంగా నిలవడమే అందుకు నిదర్శనమన్నారు. సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ లను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా పోలీస్ వ్యవస్థ పని చేయనుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించడమే కాకుండా..ప్రత్యేక సదస్సులు నిర్వహించి మత్తు వల్ల జీవితం చిత్తవకుండా సమాజాన్ని చైతన్యవంతం చేసే రూట్ మ్యాప్ పై కసరత్తు జరుగుతుందన్నారు.

గంజాయి రవాణా ఎక్కువగా జరిగే రాష్ట్ర సరిహద్దులు, అంతరాష్ట్ర ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హోం మంత్రి తెలిపారు. గంజాయి నివారణకు తీసుకుంటున్న చర్యలు మరింత పటిష్టం చేసే దిశగా గంజాయి సాగు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ లు, శాటిలైట్ ల ద్వారా పర్యవేక్షణ చేస్తూ గిరిజన ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. గంజాయికి యువత బానిసవ్వకుండా చేయడంలో ఏపీ పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమన్నారు. గిరిజన యువతకు గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకునే చర్యలపైనా చర్చించినట్లు తెలిపారు. గంజాయి నివారణ, కట్టడి చర్యలపై జరిగిన ఈ మంత్రి వర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర,సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.