నీట్‌ పరీక్షపై సుప్రీంకోర్టు తుది తీర్పు

న్యూఢిల్లీ,మహానాడు: నీట్‌ -యుజీ పరీక్ష పవిత్రత దెబ్బ తినేలా వ్యవస్థాగత ఉల్లంఘన జరగనందున పరీక్షను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నిర్లక్ష్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్రానికి, ఎన్‌టీఏకి మొట్టికాయ లేసింది. నీట్‌లో సంస్కరణలను పరిగణన లోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిధిని పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వివరణాత్మక తీర్పు నిచ్చింది.

మరోసారి పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నప్పటికీ, పరీక్షలో అవకతవకలు జరిగినందున 44 మంది అభ్యర్థులు కచ్చితమైన మార్కులు సాధించారని చీఫ్‌ జస్టిస్‌ ప్రస్తావించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీ సెప్టెంబర్‌ 30 లోగా నివేదిక సమర్పించాల్సిందిగా గడువు విధించింది. పరీక్షా విధానాన్ని పటిష్టం చేసేందుకు సాంకేతికత పురోగతిని స్వీకరించేలా ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాన్ని రూపొందించడాన్ని కె. రాధాకృష్ణన్‌ కమిటీ పరిశీలించాలని సూచించింది.