ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

టీడీపీ ఎస్సీ సెల్ నేత కోడూరి అఖిల్ హర్షం

విజ‌య‌వాడ‌: ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్న న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఎస్సీల వర్గీకరణకు చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరు అఖిల్ హర్షం వ్యక్తం చేశారు.

ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాల ఉపకులానికి ఎక్కువ లబ్ధి చేకూరుతుందని.. మాదిగలు నష్టపోతున్నారంటూ ఉమ్మడి రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగలంతా పోరుబాట పట్టారు. 1994లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితిని స్థాపించి ఉద్యమించారు.

పాత ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి వర్గీకరణ కోసం పోరాటాన్ని ప్రారంభించారు. మందకృష్ణ పోరాటానికి టీడీపీ అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని 1997లో హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు నిర్ణయాన్ని మాల మహానాడు వ్యతిరేకించి.. టీడీపీ నిర్ణయంపై నిరసనలు చేపట్టింది. అయినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో వర్గీకరణను అమలు చేశారు.

దీనిపై ఎస్సీల్లో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలును వ్యతిరేకిస్తూ మాలమహానాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించింది దీంతో రిజర్వేషన్లలో వర్గీకరణ రద్దు చేశారు. దీనిపై వివాదం సుప్రీం కోర్టును చేరింది. అప్పట్లో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాలలకు అనుకూలంగా తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని పేర్కొంది.

2004 తీర్పు నేపథ్యంలో అప్పటినుంచి ఎస్సీ వర్గీకరణపై వివాదం కొనసాగుతూ వస్తోంది.. ఎన్నికల ప్రచా సభలో ఎస్సీ రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామని ప్రధామంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. చివరకు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలదేనంటూ సుప్రీం కోర్టు వెల్లడించడంతో ఈ సమస్య ఒక దారికి వచ్చింది.