– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్
అమరావతి, మహానాడు : ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ అన్నారు. దశాబ్దాల తరబడి మాదిగలు చేసిన పోరాటానికి ఒక ఫలితమే ఈ తీర్పు అని విల్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
1970 దశకం నాటికే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఉపకులాల్లో విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న తీరులో వైరుధ్యాలు ఉండడం వల్లే మాదిగలు పోరాటం మొదలు పెట్టారని అన్నారు. 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించింది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలను ఎ బి సి డి లుగా చెయ్యాలన్నది ప్రధాన డిమాండ్. 2000 సంవత్సరంలో రిజర్వేషన్ హేతుబద్దీకరణ చట్టం తెచ్చింది.
2004 నవంబర్లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టి వేసింది. వై.ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసేలా తాను కృషి చేసానని అప్పట్లో కొందరు నేతలు సహకరించలేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి శల్య సారధ్యం చేశారని అన్నారు. 2004 లో ఉషా మెహెరా కమిషన్ వేసి చేతులు దులుపు కొన్నారని కమిషన్ అనుకూల నిర్ణయం ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చెయ్యలేదని విల్సన్ విమర్శించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని.. ఆ ఆర్టికల్ లో మూడవ క్లాజ్ ను చేర్చడం ద్వారా రాష్ట్రాల శాసనసభలు ఏకగ్రీవ తీర్మానం చెయ్యడం ద్వారా ఉపకులాల వర్గీకరణ పార్లమెంట్ ఆమోదించ వచ్చని కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అప్పటి మన్మోహన్ ప్రభుత్వం చేయలేదన్నారు.
మోడీ సంకల్పం
ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ విషయంలో పాజిటివ్ గా ఉండడం వల్ల వర్గీకరణ అమలు ఇక సాధ్యమే అన్నారు. బీజేపీ అది నుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటి సుప్రీం తీర్పు దరిమిలా వర్గీకరణ నల్లేరు మీద నడకే అన్నారు. రాజకీయంగా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో 179 నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, చతీస్ గడ్ రాష్టాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని తాను ప్రధానికి లేఖ రాసినట్టు విల్సన్ చెప్పారు.