Mahanaadu-Logo-PNG-Large

వృద్ధుల ఉసురు తీసిన అధికారులపై చర్యలు తీసుకోండి

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
మానవ హక్కుల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ

అమరావతి, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, పీఆర్‌ఆర్‌డీ పీఎస్‌ శశిభూషణ్‌, సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. పెన్షన్‌ పంపిణీ వ్యవహారంలో వారి అనాలోచిత నిర్ణయాల కారణంగా వృద్ధులు చనిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్లను దూరం పెట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏప్రిల్‌ నెలలో వృద్ధులను గ్రామ సచివాలయాలకు పిలిచి ఇబ్బందులు పెట్టి 33 మంది మరణానికి కారణమ య్యారని తెలిపారు. వృద్ధులు ఇబ్బందులు పడతారని, ఇతర ఉద్యోగులతో ఇంటి దగ్గరే పెన్షన్‌ పంపిణీ చేయాలని ముందే తాము సీఎస్‌ జవహర్‌రెడ్డిని కోరినా పట్టించుకోలేదని వివరించారు.

డీబీటీ ద్వారా కొంత మంది పెన్షన్‌దారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం సులభం కాదని గ్రామిణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పినా పీఆర్‌ఆర్‌డీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ పెడచెవిన పెట్టారని ఫిర్యాదు చేశారు. ముగ్గురు అధికారులు జగన్‌కు రాజకీయ లబ్ధిచేకూర్చేందుకు వృద్ధులపై కుట్ర పన్నారని తెలిపారు. మరణించి న వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఈ విషయాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో కోరారు.