రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

– ఏపీ & టీఎస్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొన్న రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ: ప్రతి నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
రామవరప్పాడు లోని ది కె హొటెల్ లో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. పలు అంశాలు, సమస్యలు, నూతన విధివిధానాలపై చర్చించారు.

అసోసియేషన్ అధ్యక్షులు సాంబి రెడ్డి అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందితే కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. నా చిన్నతనంలోనే నా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు హోమ్, హెల్త్, రవాణా శాఖల సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. రవాణా శాఖ సాఫ్ట్వేర్ లో ఉన్న ఇబ్బందులను త్వరలో నే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో టాక్స్ ల తగ్గింపు విషయంలో ముఖ్యమంత్రి కి పరిస్థితిని వివరిస్తామని, ప్రభుత్వ శాఖలకు ఆదాయం లేకపోతే మెరుగైన సేవలు అందించలేమన్నారు.

అధికారుల వలన ఇబ్బందులు ఉంటే నేరుగా నన్ను సంప్రదించడానికి అసోసియేషన్ కార్యవర్గం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఫ్రెండ్లీ పరిపాలన అందిస్తున్నారని మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులు వ్యక్తిగత కక్షల కారణంగా చేసే కొన్ని పనులకు ప్రభుత్వాన్ని అపాదించవద్దని మనవి చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన లో బస్సు యజమానులు శ్రేయస్సు కోసం పని చేసారని చెప్పారు. 2+1 స్లీపర్ బస్సులను రిజిస్ట్రేషన్ చేసి అల్ ఇండియా పర్మిట్ కి అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు కి దక్కుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా అసోసియేషన్ పనిచేస్తుందన్నారు. బస్సు యజమానులు అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.