గణపతి పందిరికి అనుమతి తీసుకోండి

– ఎస్పీ సతీష్ కుమార్

గుంటూరు, మహానాడు: నాయక చవితి పండుగ సందర్భంగా పందిరి/మండపాలు ఏర్పాటు చేసుకునే భక్తులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో కోరారు. ఈ వివరాలు పాటించాలని కోరారు. వినాయక “విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో తెలిపి, వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు జత చేయాలి.

ప్రైవేట్ లేదా పంచాయతీ/మున్సిపాలిటీ కి సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా ఆ ప్రవేటు స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తీసుకొని వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు వద్ద ఇసుక, నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలి.

మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకుంటూ ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ బాక్స్ లను ఉపయోగించాలి.

భద్రత కొరకు రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండవలెను. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు కాని, ప్లెక్సీలు గాని రోడ్డుపైన ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించరాదు. ఊరేగింపు సమయంలో బాణసంచా పేల్చడం చేయరాదు. పందిళ్ళ వద్ద, ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా బాధ్యత వహించాలి. నిమజ్జన ఊరేగింపునకు అనుమతించిన సమయం, నిమజ్జనానికి కేటాయించిన ప్రదేశం, ఊరేగింపునకు కేటాయించిన మార్గం లాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించవలెను. నిమజ్జనానికి వెళ్లే వాహనం పై మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేదా మైనర్ లు ఉండరాదు. వెలుతురు ఉండగానే నిమజ్జన ప్రదేశానికి వెళ్ళాలి.

ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు, భద్రత కొరకు తగినంత మందిని ఆ ఏరియా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. నిమజ్జనానికి చిన్న పిల్లలను, మద్యం సేవించిన వారిని తీసుకెళ్లకండి. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని నిబంధనలు పాటించేలా వినాయక విగ్రహా కమిటీ బాధ్యతా తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు.