సేవ, సహాయానికి మారుపేరు టీడీపీ

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్

గుంటూరు, మహానాడు:  తెలుగుదేశం పార్టీ అంటే కేవలం రాజకీయాలు చేయడమే కాదని, ఆపన్నులకు సహాయం అందించడంలో కూడా ముందుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ 4వ డివిజన్ కు చెందిన తుళ్లూరి నాగరాజు ఇటీవల చనిపోగా అతని పిల్లలు సన్విత, పరమేశ్వరిల స్కూలు ఫీజు నిమిత్తం రూ.10 వేలు, అలాగే ఇటీవల మరణించిన జట్టు రమణ కుటుంబానికి రూ.5 వేలు ఆర్ధిక సహాయాన్ని గద్దె రామమోహన్ సొంత నిధులతో వారికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కార్యాలయం వద్ద శనివారం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే సేవ, సహాయానికి మారుపేరు అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం చేయడంతో పాటుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేల సంఖ్యలో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందించామన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. తమ పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉంటారని చెప్పారు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి నేతృత్వంలో బాధితులను ఆదుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతికుమార్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, పోలా మన్మధరావు, గద్దె రమేష్, మట్ట నాగేశ్వరరావు, పొట్లూరి దర్శిత్ తదితరులు పాల్గొన్నారు