Mahanaadu-Logo-PNG-Large

బోనాల జాతరతో తెలంగాణ ఖ్యాతి జగద్వితం

అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు

అన్ని శాఖలు ప్రభుత్వ నిర్దేశాలను తప్పకుండా అమల్లో పెట్టాలి
సాంస్కృతిక శాఖ బోనాల జాతరను శోభాయమానంగా చేపట్టాలి
జూలై 5 లోగా జాతర పనులు పూర్తి చేయాలి
సకాలంలో పనులు పూర్తిచేయని అధికారుల పై క్రమశిక్షణా చర్యలుంటాయి
ఆషాడ బోనాల జాతర ఏర్పాట్ల పై అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష

బోనాల పండుగ సందర్భంగా అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ నిర్దేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ఆషాఢ మాస బోనాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఆషాడ బోనాల జాతర నిర్వహణ ఏర్పాట్ల పై బేగంపేట హరిత ప్లాజాలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, డిజిపి రవి గుప్తా, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంత రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ లు రామకృష్ణారావు, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఆలయాల కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి బోనాల జాతరను విజయవంతం చేయాలి

బోనాల పండుగ నిర్వహణలో జిహెచ్ఎంసిది కీలక పాత్ర అని మంత్రి సురేఖ అన్నారు. సానిటేషన్, ఫాగింగ్, పార్కింగ్ స్థలాలు, రోడ్ల నిర్వహణ, మహిళలకు ప్రత్యేక టాయిలెట్ల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను జిహెచ్ఎంసి ప్రణాళికాబద్ధంగా సమన్వయం చేసుకుంటు సాగాల్సి ఉందని అన్నారు. హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి దేవాలయాలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు సప్లై చేయడంతో పాటు మురుగనీటి నిర్వహణలో శ్రద్ధను కనబరచాలని మంత్రి సూచించారు.

భక్తులు వరుసక్రమంలో దైవ దర్శనం చేసుకునేలా, వరుసలను అతిక్రమించకుండా తగిన ఎత్తులో బారికేడ్లను ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశనం చేశారు. అత్యవసర ద్వారాల వద్ద వాలంటీర్లను పెట్టాలని సూచించారు. పోలీస్ శాఖ బాంబు స్క్వాడ్ లతో నిరంతరం చెకింగ్ లు చేస్తూ, మఫ్టీ పోలీసులతో నిరంతర నిఘాను చేపడుతూ, లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అనుక్షణం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

అగ్నిమాపక శాఖ తమ సిబ్బందితో పాటు వాలంటీర్లను ఎంపిక చేసుకుని వారికి తగిన శిక్షణనిచ్చి దేవాలయాల వద్ద వార సేవలను వినియోగించుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య శాఖ అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ నిచ్చేలా దేవాలయవాల వద్ద సేవలందిస్తున్న ఇతర శాఖల సిబ్బందికి శిక్షణనివ్వాలని మంత్రి సూచించారు. వృద్ధులు, వికలాంగులకు దైవదర్శనం కల్పించేందుకు బ్యాటరీ వాహనాలను వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

దేవాలయాలు, బస్ స్టాప్ లలో పాలిచ్చే తల్లులకు ఇబ్బందులు కలగకుండా లాక్టేషన్ గదులను తప్పక ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి వచ్చి, దైవదర్శనం కోసం లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో చిన్నపిల్లలు అలసిపోకుండా వారికి బాలామృతం వంటి పోషకాహారన్ని అందిచేందుకుగాను అంగన్వాడీ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. వాలంటీర్లను భక్తులు సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా వారికి డ్రెస్ కోడ్ ను కేటాయించాలని అన్నారు.

తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్యాత్మిక, భక్తి సంబంధమైన ప్రసారాలకై ప్రత్యేకంగా ఛానెల్ ను తెచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖను ఆదేశించారు. ఆషాడ బోనాల జాతరను గ్రంథస్తం చేయడంతో పాటు డాక్యుమెంటరీని రూపొందించాలని సూచించారు. సినిమా థియేటర్స్ లో బోనాల జాతర పై అడ్వర్టైస్ మెంట్ లను ప్రసారం చేసే దిశగా సినీ పరిశ్రమతో చర్చించాలని అన్నారు.

బోనాల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అదనపు సర్వీసులను నడపడంతో పాటు, రాత్రి సమయాన్ని పొడిగించాలని సూచించారు. అమ్మవారి ఘటం ఊరేగింపు నిమిత్తం కర్నాటక నుంచి తెప్పిస్తున్న ఏనుగు (రూపవతి) రవాణా ఎంతవరకు వచ్చిందని మంత్రి ఆరా తీశారు. జాతరలో వినియోగించుకునే సమయంలో ఏనుగును ప్రశాంతంగా వుంచాలని, తగిన విశ్రాంతినివ్వాలని అటవీశాఖ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు.

చప్పట్లతో కొండా సురేఖకు మద్దతు పలికిన సమావేశం

బోనాల జాతరను శోభాయమానంగా తీర్చిదిద్దటంలో సాంస్కృతిక శాఖది ప్రత్యేక పాత్ర అని మంత్రి అన్నారు. బోనాల జాతర సందర్భంగా చేపట్టే సాంస్కృతిక ప్రదర్శనల పై మంత్రి సురేఖ ఆరా తీశారు. జానపద కళాకారులకు తగిన అవకాశాలు కల్పించి, వారిని ప్రోత్సహించాలని, జానపద కళలను బతికించాలని మంత్రి సురేఖ సాంస్కృతిక శాఖను ఆదేశించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటి సభ్యులు చప్పట్లతో మంత్రి సురేఖకు మద్దతు తెలిపారు.

‘తగ్గేదే లే’ అన్న మంత్రి సురేఖ

దేశరాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లోనూ, అమెరికా, కెనడా, యుకె, ఆస్ట్రేలియాల్లో జరుగుతున్న బోనాల జాతర ఉత్సవాల గురించి మంత్రి సురేఖ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. తనతో పాటు మహిళా అధికారులు ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రస్తావిస్తూ ఫ్రీ బస్సు పథకంతో మగాళ్ళకు బస్సుల్లో సీట్లే దొరకటం లేదు, ఇక విమానాలను కూడా విడిచిపెట్టరా అని నవ్వుతూ ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేఖ తగ్గేదే లే అనడంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి.

మహిళలు తమ ప్రతిభాపాటవాలను చాటుతూ అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నారని, రాబోయేది మహిళల రాజ్యమేనని ఈ సందర్భంగా మంత్రి సురేఖ సమావేశాన్ని ఉద్దేశించి అన్నారు.