Mahanaadu-Logo-PNG-Large

ఇసుక, గనుల తవ్వకాలకు టెండర్లు పిలవాలి

తక్షణమే వార్షిక క్యాలెండర్‌ రూపొందించాలి
ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి
నది తీరాల్లో తవ్వకాలపై నివేదిక సిద్ధం చేయాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్‌: ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌ రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల శాఖలో ఆదాయం తీరును సమీక్షించారు. గతంతో పోలిస్తే గణనీయంగా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుక తరలించాల్సిన అవసరం ఉంది. సాగునీటి అధికారులు కోరినట్టుగా నాకు సమాచారం ఉంది. ఈ ప్రాజె క్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రం లో నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని, ఈ అంశంలో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పలు గ్రానైట్‌ క్వారీలకు ఫైన్లు వేసి మూసివేశారు. అవి ఎంతవరకు వసూలు చేశారు, ప్రస్తుతం ఆ క్వారీల పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

గోదావరి తీరం వెంట తవ్వకాలపై నిఘా పెట్టాలి: సీతక్క

పట్టా భూముల పేరిట గోదావరి నది తీరం వెంట విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, వీటిపై నిఘా పెట్టాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క అధికారులను కోరారు. ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే దళారులకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందా? అనే అంశం పైన సమగ్ర సర్వే నిర్వహించాలని గనుల శాఖ అధికారులను డిప్యూటీ సీఎం కోరారు. ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరే వరకు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖజా నాకు ఆదాయం సమకూర్చడం, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాల ని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా మాఫియా కార్యకలాపాలు, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే పనులు జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ హరిత, స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.