రాష్ట్రానికి ఇదొక సుదినం…శుభపరిణామం
2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి నిధుల కేటాయించడం సంతోషదాయం
ఆ రెండు ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా లక్ష ఉద్యోగాల కల్పన
జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం సమాజానికి చేటు
త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం
-మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి :- పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడమే కాకుండా ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ధిష్టమైన క్యాలెండర్ ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖా మంత్రి నిర్మళా సీతారామన్, జలవనరుల శాఖా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
2027 మార్చి నాటిని ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆ ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులు కేటాయించింది. నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుంది.
పోలవరం ఫేజ్-1 కు రూ.30,436.95 కోట్లు ఖర్చు అవుతుంది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్ర తరపున రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశాం. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించుకున్నాం. కేంద్రం నుండి రూ.25,706 కోట్లు మొత్తంగా రావాల్సి ఉంది. అందులో రూ.15,146 కోట్లు విడుదల చేశారు.
భూ సేకరణ, పరిహారానికి రూ.1,095 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. మిగిలిన రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ నిధుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.6 వేల కోట్లు, 2025-26 మధ్య రూ.6,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. దక్షిణ భారతదేశంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి.
ఏపీకి గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ధవళేశ్వరం కంటే పోలవరం ప్రాజెక్టు ముందే పూర్తికావాల్సి ఉంది. కానీ రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టులను మార్చి 2009 వరకూ పని చేయనీకుండా అడ్డుపడ్డారు. కానీ 2014లో విభజన తర్వాత ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే తెలంగాణలోని 7 ముంపు మండలాలు ఏపీలో కలపాలని, అవి కలిపిన తర్వాతే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్తే అప్పుడు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 28 సార్లు పోలవరం క్షేత్రస్థాయికి వెళ్లి పనులు పరిశీలించా, 82 సార్లు వర్చువల్ గా సమీక్షించా.
పోలవరంను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని పనిగా పెట్టుకుని 72 శాతం పూర్తి చేశాం. టీడీపీ హయాంలో ఐదేళ్లలో రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. డయాఫ్రం వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశాం. నిర్వాసితుల కోసం 4,114 కోట్లు ఖర్చు చేశాం. మేం ఖర్చు పెట్టిన వాటిల్లో నుండి కేంద్రం రూ.4,998 రీయింబర్స్ చేసింది. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం పట్టుకుంది.
కానీ విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజునే పనులు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. నేను ప్రమాణస్వీకారం చేయాలంటే 7 మండలాలు ఏపీలో కలపాలని కేంద్రం ప్రతిపాదన పెట్టా. అది నా దూరదృష్టి. పోలవరంలో కాంట్రాక్టు సంస్థ ఉండటానికి వీళ్లేదని పంపించేశారు.
ప్రాజెక్టును అనాథగా మార్చారు. దీన్ని అహంబావం అనుకోవాలో, పిచ్చా అనుకోవాలా అర్థం కాలేదు. రివర్స్ టెండరింగ్ అంటూ పైశాచిక ఆనందాన్ని పొందారు. 2019 మే నెల నుండి 2020 అక్టోబర్ నెల వరకు గాలికొదిలేశారు. టీడీపీ హయాంలో కొనసాగిన విధంగా పనులు సాగి ఉంటే, కాంట్రాక్టర్ ను మార్చకుండా పనులు కొనసాగించి ఉంటే 2021కే ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ నిర్లక్ష్యం చేయడంతో కాఫర్ డ్యాం, డయాఫ్రంవాల్ కొట్టుకుపోవడంతో నష్టం వాటిల్లింది.
గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4,167 కోట్లు మాత్రమే ప్రాజెక్టుకు ఖర్చు చేసింది. మేము ఖర్చు చేసిన దానికి కేంద్రం బకాయిల కింద రూ.8,382 కోట్లు ఇస్తే…వాటిల్లో రూ.3,345 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా గత పాలకులు దారి మళ్లించారు. ఇది ఎంత బాధ్యతారాహిత్యమో, నిర్లక్ష్యమో అర్థమవుతోంది.’ అని సీఎం అన్నారు.
కేంద్రం చెప్పినా గత పాలకులు వినలేదు
‘‘కాంట్రాక్టర్లను మార్చొద్దని ఆనాడే కేంద్రం రెండు సార్లు హెచ్చరించింది. పోలవరం ప్రాజెక్ట అథారిటీ చైర్మన్ లేఖ రాసినా గత ప్రభుత్వం వినలేదు. హైదరాబాద్ ఐఐటీ ప్రతినిధులు వచ్చి ప్రాజెక్టు పరిస్థితిపై రీసెర్చ్ చేశారు. వారితో కూడా అడ్డమైన ఆర్గ్యుమెంట్లు చేశారు. 2014-19 మధ్య సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, ఇంజనీర్లంతా ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయాలు తీసుకుని పనులు చేపడితే…ప్రాజెక్టు ఆలస్యంపై హైదరాబాద్ ఐఐటీ వారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు.
కానీ ఒక వ్యక్తి దుర్మార్గ చర్యలు, అవగాహన లోపం వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే వచ్చింది…రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో రాష్ట్రానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. దీంతో పూర్తి పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవంరకు మళ్లీ జీవం పోశాం.’ అని సీఎం పేర్కొన్నారు.
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కులతో లక్ష ఉద్యోగాలు
‘దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఏపీకి 3 కారిడార్లు వచ్చాయి. విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్లు ఏపీకి వచ్చాయి. ఈ 3 కారిడార్లలో రూ.28,602 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఉద్యోగ, ఉపాధి కల్పన.
కడప, కర్నూలు జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి కేంద్రం నిదులు కేటాయిస్తూ ప్రకటించడం సంతోషదాయకం. కడప జిల్లాలోని కొప్పర్తిలో 2,590 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ద్వారా రూ.2,137 కోట్లు పెట్టుబడులు వచ్చి 54 వేల మందికి ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో 2,600 ఎకరాల్లో హబ్ ఏర్పాటు కానుంది. ఇక్కడ రూ.2,746 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. తద్వారా 45 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కృష్ణపట్నంలో కూడా హబ్ కు అనుమతి వచ్చింది. దీనికి రూ.18 వందల కోట్లు ఖర్చు చేస్తాం. త్వరలో నక్కపల్లిలో ఫార్మాహబ్ కు టెండర్లు పిలుస్తాం. రాష్ట్రంలో వివిధ సంస్థలు, ప్రాజెక్టులు మళ్లీ ముందుకు కదిలే పరిస్థితి వచ్చింది. దీనికి సహకరిస్తున్న కేంద్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఎకానమీ గ్రోత్ తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కానీ గతంలో సర్వనాశనం చేసి, ఇప్పుడు మళ్లీ నిధుల రాక మా ఘనత అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీమను సస్యశ్యామలం చేస్తాం
‘పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యేకొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం గోదావరిలో ముంచిన పోలవరాన్ని పైకి తెచ్చాం…ట్రాక్ లో పెట్టాం. ఫేజ్-1 2027 మార్చి నాటికి పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ వరకూ నీళ్లు ఇవ్వొచ్చు. పట్టిసీమ, పురుషోత్తపట్నంను గత ఐదేళ్లు వినియోగించకుండా పంటలు ఎండబెట్టారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ కు పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇస్తున్నాం.
త్వరలో పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ద్వారా అనకాపల్లికి నీరందిస్తాం. మరోవైపు పట్టిసీమ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్లు తెచ్చి నాగార్జున సాగర్ కుడి కాల్వలో ఎత్తిపోస్తాం. వైకుంఠపురం ఎత్తిపోతల పూర్తి చేస్తే గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడి కాల్వకు 150 టీఎంసీలు మళ్లించవచ్చు. తద్వారా కృష్ణా నదిలో నీటి లభ్యత పెంచి సీమకు అందిస్తాం. నల్లమల గుండా బనకచర్లకు నీటిని తీసుకెళ్తే సీమలోని అన్ని రిజర్వాయర్లను నీటితో నింపొచ్చు.’ అని సీఎం వివరించారు.
జగన్ లాంటి వ్యక్తి పార్టీ నడపడం సమాజానికి చేటు
‘పార్టీలోకి ఎవరొచ్చినా పదవులకు రాజీనామా చేసి రావాలి. ఎవర్నంటే వారిని కాకుండా పార్టీలోకి వచ్చేవారి వ్యక్తిత్వాలను, చరిత్రను పరిశీలించాకే పార్టీలోకి తీసుకుంటాం. జగన్ లాంటి వ్యక్తులు పార్టీలు నడపడం సమాజానికి నష్టం…జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి విధ్వంసకారున్ని చూడలేదు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వాలి.
రాష్ట్ట్రానికి కియా మోటార్స్ తెచ్చేందుకు కోసం సౌత్ కొరియా వెళ్లి ఆహ్వానించాం. వారు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి, నమ్మకం కల్పించడానికి ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చుకున్నాం. ప్రాజెక్టు పెట్టాలంటే నీరు అవసరమని కియా వారు అంటే 8 నెలల్లోనే గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిచ్చి వారికి నమ్మకం కలిగిస్తే అప్పుడు పరిశ్రమ నెలకొల్పారు. కానీ గత ఐదేళ్ల పాటు అలాంటి కియా పరిశ్రమకు ఇవ్వాల్సిన రూ.17 వందల కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది…ఇలా చేస్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా.?
పంచాయతీ రాజ్ శాఖలో రూ.990 కోట్లు ఎక్కడికి డైవర్ట్ చేశారో తెలీదు. కానీ మేము వచ్చాక వాటిని విడుదల చేశాం…మళ్లీ రూ.11 వందల కోట్లు విడుదల చేయబోతున్నాం. నిధుల కోసం కేంద్రం వద్దకు వెళ్తే గతంలో ఇచ్చిన నిధుల ఖర్చుకు సంబంధించి యూసీలు ఇవ్వలేదని ఎదరు లేఖలు పంపుతున్నారు. గత ప్రభుత్వం కారణంగా ఢిల్లీలో మన అధికారులు కూడా తలెత్తుకోలేని పరిస్థితి దాపురించింది.
వ్యవస్థలను భ్రస్టుపట్టించారు. కేంద్రంలో మన అధికారులు లేకపోతే అది మనకు అవమానకరం. అలాంటి దారుణమైన పరిస్థితిని కల్పించారు. ఇప్పుడిప్పుడే మన ఏపీ బ్రాండ్ సెట్ అవుతోంది. జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో లేకుండా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్ కనీసం ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అర్హత లేని వ్యక్తి. రాజధానిలో జగన్ చేసిన కంపు అంతాఇంతా కాదు. దాన్ని శుభ్రం చేయడానికి అమరాతిలో రూ.35 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది…ఎక్కడ చూసినా విధ్వంసమే సృష్టించారు.’ అని సీఎం ధ్వజమెత్తారు.
ఆ నేతలను చూస్తుంటే జుగుప్స కలుగుతోంది
‘వైసీపీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్యారెక్టర్ల గురించి రోజుకొక అంశం బయటకు వస్తుంటే చూసి విస్తుపోతున్నా. నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన పార్టీ, వ్యక్తులను చూడలేదు. ఇన్నీ దుర్మార్గాలు బయటపడుతున్నా ఆ పార్టీని నడుపుతున్న వ్యక్తి మాట్లాడరా.?..బాధ్యత లేదా.? ఇవన్నీ చూస్తుంటే సిగ్గుగా అనిపించడం లేదా.? దోపిడీ కోసం తెచ్చిన మద్యం విధానాన్ని కూడా సమర్థించుకుంటున్నారు.
సొంత బ్రాండ్లు పెట్టుకునే హక్కు ఎవరిచ్చారు.? ఇలాంటి వారితో రాజకీయాలు చేయాల్సి వస్తోందని బాధగా ఉంది. కొందరు పోలీసులు కూడా ఎలా ప్రవర్తించారో చూశాం. నా ఇంటికి తాళ్లు కట్టారు…అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. నాపై రాళ్లు వేయించి ప్రజాస్వామ్యం అన్నారు. గత ఐదేళ్లు పాత్రికేయులు కూడా ప్రశాంతంగా లేరు. వారి మొహాల్లో కూడా ఎక్కడో తెలియన బాధ, బయం కనిపించాయి. ఇప్పుడే వారి మొహాల్లో మళ్లీ ప్రశాంతత కనిపిస్తోంది’ అని సీఎం అన్నారు.
సరైన వ్యక్తికి..సరైన స్థానం కల్పిస్తాం
‘నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తాం. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిత గుర్తింపు ఉంటుంది. సరైన వ్యక్తికి సరైన హెదా కట్టబెడతాం..ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. పార్టీ కోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ పార్టీ గుర్తిస్తుంది. గత పాలకులు చేసిన దుర్మార్గాలను సరిదిద్ది పాలన గాడిన పెట్టి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో నడిపిస్తాం.
పార్టీ అధికారంలోకి వచ్చే రెండు నెలలు గడిచింది. ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ ఆకాంక్షలు ఎన్నో ఉన్నాయి..వారి ఆశలు ప్రతిఫలించేలా, వారి ఆకాంక్షలు ప్రతిభింబించేలా పదవుల పంపిణీ ఉంటుంది. మిత్ర పక్షాలతో చర్చించి పదవుల పంపకంలో మిత్రధర్మం పాటించాల్సి ఉంది.’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.