– దళితులను రానివ్వరని ఎవరు చెబుతున్నారు?
– ఎస్కోబార్ కు, జగన్ కు పెద్ద తేడా లేదు
– డిక్లరేషన్ ఇవ్వాలన్న కారణంతోనే తిరుమల వెళ్లడానికి జగన్ ఇష్టపడలేదు
– వైసీపీ నేతలకు ఇచ్చిన నోటీసులను తనకు ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నాడు
– తిరుమల రావొద్దని జగన్ ను ఎవరైనా అన్నారా?
నేను కూడా చర్చికి, మసీదులకు వెళ్లినప్పుడు అక్కడి సాంప్రదాయాలు తప్పకుండా పాటిస్తా
– శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది
– నెయ్యి కల్తీ అయ్యిందన్న రిపోర్టును బయటపెట్టకపోతే మేము తప్పు చేసినోళ్లమవుతాం
– అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించాలి…మత సామరస్యాన్ని దెబ్బతీస్తే మిన్నకుండిపోవాలా?
– బంగారంలాంటి పందికొవ్వును రాగిలాంటి నెయ్యిలో కలుపుతారా అని మాట్లాడటం భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా?
– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ‘తిరుమలకు జగన్ రావొద్దని మేం అన్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. శ్రీవారిపై భక్తి ఉండే ఎవరికైనా తిరుమల వెళ్లే స్వేచ్చ ఉంది. ఇతర మతాలకు సంబంధించిన వారెవరైనా తిరుమలకు వెళ్తే అక్కడి సాంప్రదాయాలు పాటించాలి, గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
సచివాలయంలో శుక్రవారం సీఎం విలేకరులతో మాట్లాడుతూ… సాంప్రదాయాలను పాటించడం ఎన్నో దేవాలయాల్లో ఉంది. తిరుమలకు రావొద్దని జగన్ కు ఎవరూ చెప్పలేదు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే జగన్ రాలేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో వారు ఆందోళనలో ఉన్నారు.
మత సంఘాలు, రాజకీయ పార్టీలకు సంబంధించి వేలమంది మొహరిస్తుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 30 యాక్ట్ పోలీసులు అమలు చేశారు. తిరుమలకు వెళ్లకుండా ఉండేందుకు జగన్ కు ఏం సాకులు ఉన్నాయో తెలీదు? తిరుమల వెళ్లకుండా తనకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నాడు.ఆ నోటీసులు చూపించాలి. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం సబబు కాదు.
ప్రజాజీవితంలో ఉండే అందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంద్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దేవుని ఆచారాలు, సాంప్రదాయాలకంటే వ్యక్తులు గొప్పకాదు. వాటిని ధిక్కరించేలా ఎవరూ ప్రశ్నించకూడదు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ తీరుపై ధ్వజమెత్తారు.
చర్చికి వెళ్లినా..మసీదుకెళ్లినా అక్కడి సాంప్రదాయాలు పాటించాలి
‘తిరుమల హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం, దివ్యవక్షేత్రం. ఒక్కసారైనా శ్రీవారిని దర్శించకుని మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటారు. తిరుమల పుణ్యక్షేత్రం ఏపీలో ఉండటం మన అదృష్టం. ఆ పుణ్యక్షేత్ర పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తిరుమల వెళ్లినప్పుడు నియమాలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కానీ నిర్లక్ష్యంగా జగన్ మాట్లాడటం సబబు కాదు.
గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లాను.ఇప్పుడు కూడా వెళ్తా అని అంటున్నాడు. ఇంతకముందు నిబంధనలు అతిక్రమించావు. ఇప్పుడు కూడా మళ్లీ అతిక్రమిస్తావా? అతిక్రమించి బెదిరించి లోపలికెళితే అది చట్టం అవుతుందా? చట్టాలు చేసే శాసనసభ్యులం మనమే వాటిని గౌరవించకపోతే, ప్రజలు ఎలా గౌరవిస్తారు?
రౌడీయిజం చేస్తామంటే కుదరదు. ఇతర మతస్తులు ఎవరొచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదవుతా అన్నాడు. బయటకు వెళ్తే ఇతర మతాలను గౌరవిస్తా అన్నాడు. నియమాలు ఉల్లంఘించకుండా పాటిస్తే గౌరవించినట్లు అవుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ అడగలేదు. ఇప్పుడెందుకు అడుగుతారని ఎదురు ప్రశ్నించడం సమంజసం కాదు.
జగన్ బైబిల్ చదవడంలో తప్పులేదు. నేను కూడా చర్చికి, మసీదులకు వెళ్లినప్పుడు అక్కడి సాంప్రదాయాలు తప్పకుండా పాటిస్తా, గౌరవిస్తా. మతసామరస్యాన్ని కాపాడతాం..సొంత మతాన్ని అనుసరిస్తాం’ అని అన్నారు. నెయ్యి కల్తీ అయ్యిందన్న రిపోర్టులు బయటపెట్టకపోతే మేము తప్పు చేసినవాళ్లమవుతాం
‘మానవత్వం అని మాట్లాడుతున్నాడు.మానవత్వానికి, మతసామరస్యానికి చాలా తేడా ఉంది. పాబ్లో ఎస్కోబార్ లాగా జగన్ లీలలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎస్కోబార్ కు, జగన్ కు పెద్ద తేడా లేదు. చెప్పిన అబద్ధాలు పదేపదే చెప్తూ సొంత పత్రిక, బ్లూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నెయ్యిలో కల్తీనే జరగలేదని ఈవో చెప్పారని అబద్ధాలు చెప్తున్నాడు. ఈఓ పదేపదే చెప్పారు. ఏఆర్ కంపెనీ 8 ట్యాంకులు పంపితే అందులో 4 ట్యాంకులు వాడారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో, 4 నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యిని ల్యాబ్ కు పంపారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టును కూడా తప్పుపదుతున్నారు.
నెయ్యి కల్తీ అయ్యిందన్న రిపోర్టును బయటపెట్టకపోతే మేము తప్పు చేసినట్లు కాదా? దేవుడు మమ్మల్ని ఎలా క్షమిస్తారు? తెలిసీతెలీక తప్పులు జరిగాయని క్షమించాలని, ప్రతి ఏటా ఆగస్టు 15 తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు. కానీ నెయ్యి కల్తీ జరగడంతో ఇటీవల సంప్రోక్షణ, శాంతియాగం చేశారు’ అని సీఎం వివరించారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు?
‘గతంలో ఉన్న టెండరు నిబంధనలు ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి. వ్యాపారులను ప్రోత్సహించి రివర్స్ టెండరింగ్ లో తక్కువ రేటుకే వస్తుందని అపవిత్రం చేశారు. భక్తులు కూడా చాలా సార్లు చెప్పారు…అన్నప్రసాదం, ప్రసాదం బాగోలేదని చెప్పారు. నాసిరకం పదార్ధాలు వాడి తప్పుడు పనులు చేశారు. అందుకే అన్ని దేవాలయాల్లో ప్రక్షాళన చేపట్టాం.
రామతీర్థంలో రాముడి తల తీస్తే నిందితులను పట్టుకుని శిక్షించలేదు. అంతర్వేదిలో రథం తగలబడితే వాస్తవాలు బయటపెట్టలేదు. కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలిస్తే చర్యలు తీసుకోలేదు. ఇటీవల అనంతపురం జిల్లాలోని హనకనహల్ లో ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త రథాన్ని తగలెట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తే మిన్నుకుండిపోవాలా?
జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు.? ఇంట్లో కూర్చుని నెపం ఇతరులపై వేస్తున్నారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టడం ఇష్టం లేక తిరిగి దైర్జన్యంగా మాట్లాడుతున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీసుకొచ్చే కొత్తచట్టం ప్రకారం సాంప్రదాయాలు గౌరవించాలి
‘త్వరలో కొత్త చట్టం కూడా తీసుకొస్తాం. దీని ప్రకారం ఎవరు ఏ ప్రార్థనాలయాలకు వెళ్లినా అక్కడి సాంప్రదాయాలు గౌరవించాల్సిందే. మాజీ ముఖ్యమంత్రినే రానివ్వకుంటే దళితులను రానిస్తారా అని మాట్లాడుతున్నారు. దళితులను రానివ్వరని ఎవరు చెప్తున్నారు? నీ స్వార్థం కోసం దళితులను వాడుకుంటావా? తిరుమల వెళ్లడం ఇష్టంలేకే వివిధ రకాలుగా బురదజల్లుతున్నారు. జగన్ చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండదు.
ఒక దేవుడి భక్తుడిగా చెప్తున్నా. ఆ 4 ట్యాంకుల కల్తీ నెయ్యి వాడకుండా ఉంటే చాలా సంతోషించేవాడిని. అవి వాడినందునే బాధపడుతున్నా. మనోవేదనతో ఉన్నా. వెంకటేశ్వరునికి అపచారం తలపెట్టారు. 4 ట్యాంకుల నెయ్యిని ఎందుకు వెనక్కి పంపారని మాట్లాడుతున్నారు. మరి అంతక ముందు వరకూ వాడారు కదా? టెస్టులో తేలింది కాబట్టి వెనక్కి పంపాం. టీటీడీలో వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. పవిత్రతకు ఏం చర్యలు తీసుకోవాలో అన్నీ చేస్తాం. అపచారాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తామంటే కుదరదు’ అని స్పష్టం చేశారు.
బంగారంలాంటి పందికొవ్వును రాగిలాంటి నెయ్యిలో కలుపుతారా అని మాట్లాడటం మనోభావాలు దెబ్బతీయడం కాదా?
పందికొవ్వు బంగారం అని జగన్ కు సంబంధించిన మరో మనిషి మాట్లాడుతారు. బంగారంలాంటి పందికొవ్వు తెచ్చి రాగిలాంటి నెయ్యిలో కలుపుతారా అంటారు. ఇలాంటి మాటలు మనోభావాల దెబ్బతీయవా.? మీరు ఏం మాట్లాడినా భరించాలా ? ఒక్క తిరుమలే కాదు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో నిబంధనలు పాటిచాలి.
దేశంలో మత సామరస్యం కాపాడటానికి సెక్యులరిజం విధానాన్ని తెచ్చారు. మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. నేను కూడా ఏదైనా దేవాలయంలో సాంప్రదాయాలు పాటించడం ఇష్టం లేకపోతే వెళ్లను. ముఖ్యమంత్రిగా ఉండి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు జగన్ సిగ్గుపడాలి.
చట్టాలు గౌరవించి, రాజ్యాంగం అతిక్రమించబోమనే ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తాం. సాంప్రదయాలు గౌరవించి, పాటించడానికి ముఖ్యమంత్రి మొదటి వ్యక్తిగా ఉండాలి. అడల్ట్రేషన్ టెస్టులు చేయడం వల్ల 18 సార్లు వెనక్కిపంపామని చెప్తున్నారు. ఎక్విప్ మెంట్ లేకుండా ఎలా చేస్తారు.?
వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా పెట్టడం తప్పుకాదు. దాన్ని జంబో బోర్డుగా మార్చడం తప్పు. జాయింట్ ఈఓను ఏ సర్వీస్ తో పెట్టారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేశాం. పదే పదే అబద్ధాలు తిరిగి చెప్తున్నారు. తెలీసో, తెలీక తప్పులు జరిగితే క్షమించమనడానికి దేవుడికి పూజ చేస్తారు. నువ్వు కూడా తెలిసో తెలీక తప్పులు చేస్తే విచారం వ్యక్తం చేయి. అలా కాకుండా ఎదురుదాడి చేస్తావా?
వెంకటేశ్వరస్వామికి అపచారం చేసిన వాళ్లను నేను క్షమించాలా? అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తారా? వాళ్ల అపచారాలను నేను శభాష్ అనాలా? వాళ్ల తప్పులను నేను కప్పిపుచ్చాలా? సెక్యులర్ దేశంలో ఇలాంటి పరిణామాలు జరగడానికి కారణం జగన్ లాంటి వ్యక్తులే’ అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.