‘పెదకూరపాడు’ అభివృద్ధే ధ్యేయం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

పెదకూరపాడు, మహానాడు: రానున్న రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్ లు,పెన్షన్ ల పెంపు, ఉచిత ఇసుక పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. అలాగే, కూటమి ప్రభుత్వ వందరోజుల పాలన పై కాశిపాడు గ్రామంలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామ ప్రజలకు చెప్పారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇది మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఆరు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చేయనున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. గ్రామ సభల్లో వచ్చిన సమస్యల తీర్మానాలకు ఆమోదం తెలిపి పనులను వేగవంతం చేస్తున్నాం. భవిష్యత్తు కార్యచరణను సిద్ధం చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అంచలంచెలుగా అమలు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో భూ రీసర్వేలో జరిగిన అవకతవకలను వెలికి తీసి పరిష్కరిస్తాం. గ్రామ సభల ద్వారా వచ్చిన రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టిన వ్యవస్థల ప్రక్షాళనను చంద్రబాబు టీటీడీతో మొదలు పెట్టారు.