ప్రజారోగ్యాన్నిమెరుగుపరచడమే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

* ఇనమడుగు పిహెచ్‌సిలో వసతులు మెరుగుపరుస్తా..
* కోవూరు మండలంలో మరో పిహెచ్‌సి  ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

కోవూరు, మహానాడు :  నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పని చేయడమే తమ లక్ష్యమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం కోవూరు మండలంలోని ఇనమడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు. పరీక్షలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ ని అడిగి వివరాలు ఆరా తీశారు.

ఇనమడుగు పిహెచ్‌సిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది వ్యవహార శైలి గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.అన్ని విభాగాలను పరిశీలించి వసతులు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులను పరామర్శించి వారికి పండ్లు అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పని చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం కోవూరు మండలం లో 80 వేల మంది ఉండగా.. వాళ్లకు కేవలం ఒక పీహెచ్‌సీ మాత్రమే ఉందన్నారు.

తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రెండో పిహెచ్‌సి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే వస్తుంటారని, వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. వైద్యారోగ్యం పై ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోందని, అవి సద్వినియోగం అయ్యేలా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు.

ఇనమడుగు పిహెచ్‌సిలో స్థానిక డాక్టర్లు ఆమె దృష్టికి తెచ్చిన సమస్యలపై స్పందిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్‌ గుర్తింపు సాధించిన విడవలూరు మండలంలోని రామతీర్ధం పిహెచ్‌సిని ఆదర్శంగా తీసుకొని ఉత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించాలని సూచించారు.

స్థానిక సర్పంచ్ తదితర ప్రజా ప్రతినిధులు సైతం తరచూ ఆసుపత్రిని సందర్శించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారి నిరంజన్‌, సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎమ్‌ లతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీపీ పార్వతి, ఎంపీటీపీ కొల్లా సునీల్‌ రెడ్డి, సర్పంచి ప్రమీలమ్మ, ముఖ్య నాయకులు సుధాకర్‌రెడ్డి, గుత్తికొండ వెంకయ్య, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కమలాకరరెడ్డి, జనసేన నాయకులు గుడి శ్రీహరి రెడ్డి,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.