నాణ్యమైన సరుకులు అందించడమే లక్ష్యం

పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తాం
ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ 

నరసరావుపేట, మహానాడు:  పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం,కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు.రేషన్ షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ… ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేస్తామన్నారు. ప్రతి ఒక్క లబ్ధి దారుడు రేషన్ సరుకులు వినియోగించుకోవాలన్నారు. రేషన్ మాఫియా లేకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటైన రేషన్ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం బియ్యం కందిపప్పు సహా 8 రకాల సరుకులు అందించింది.

వైసీపీ పాలనలో బియ్యం తప్ప మరో సరుకు అందించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో నేడు ప్రజా పాలన ప్రారంభమైందన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. పేదలకు అన్ని రకాల సరుకులు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. రేషన్ పంపిణీలో ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నా, తప్పులు జరిగినా తన దృష్టికి తీసుకు రావాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.