సమస్యలు పరిష్కరించడమే టీడీపీ లక్ష్యం

– అర్జీలు పారదర్శకంగా ఉంటే వెంటనే న్యాయం
– గ్రీవెన్స్‌లో పార్టీ నేతలు అర్జీల స్వీకరణ

మంగళగిరి, మహానాడు: ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని.. వినతులతో వస్తున్న అర్జీదారులను సాదరంగా ఆహ్వానించి వారి నుండి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. పారదర్శకంగా ఉన్న అర్జీలకు వెంటనే న్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతులు స్వీకరించారు. టీడీపీ అధినేత ఢిల్లీకి వెళ్ళడంతో ముఖ్యమంత్రికి అర్జీలను అందించేందుకు వచ్చిన వినతిదారుల నుండి వీరు అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలపై వెంటనే సంబంధిత అధికారులను ఫోన్లు చేసి అర్జీల పరిష్కరానికి కృషి చేసినట్టు వారు తెలిపారు.

గత ప్రభుత్వంలో ఇటువంటి జవాబుదారితనం లేదని, జగన్ పార్టీ అయితేనే పోలీసు స్టేషన్ ల్లో నాడు పని జరిగేదన్నారు. నేడు ఏ పార్టీ వారు వచ్చినా వారి సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని… రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య లక్ష్యమని వర్ల రామయ్య తెలిపారు. అందులో భాగంగానే ఉదయం నుండి మంత్రులు, నేతలు సాయంత్రం వరకు టీడీపీ ప్రధాన కార్యలయంలో అర్జీదారులకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు.

వివిధర అర్జీలను ఆయా శాఖలకు, మంత్రులకు పంపుతున్నట్టు చెప్పారు. ప్రజలకు జవాబుదారిగా పనిచేసే ప్రభుత్వం తమదన్నారు.. ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి పనిచేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. గ్రీవెన్స్ సెల్ పెట్టినప్పటి నుండి వినతులతో వస్తున్న అర్జీదారులకు ఇది టీడీపీ పార్టీ కార్యాలయం కాదని ఒక దేవాలయమని అర్జీదారులు భావిస్తున్నట్టు వర్ల రామయ్య తెలిపారు. అలాంటి గొప్ప కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

వెస్ట్ బెంగాల్ లో చోటుచేసుకున్న దుర్ఘటన రాష్ట్రంలో జరగకుండా మహిళలకు, మహిళా డాక్టర్ల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైద్య శాఖ మంత్రి, హోంమంత్రికి ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్రంలో మహిళలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగేలా చర్యలు తీసుకొంటామన్నారు.

• వైసీపీ నేతల అరాచకాలు భూ కబ్జాలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తమపై అక్రమ కేసులు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించాడని.. నాడు వైసీపీ నేతల దాడులు తట్టుకోలేక చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఊరు విడిచి పారిపోయారని.. నేడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఒక్కొక్కరు సొంత ఊరికి తిరిగి వెళుతున్నారని, వైసీపీ నేతలు ప్రోద్భలంతో అక్రమంగా పెట్టిన రౌడీ షీట్ ను తొలగించాలని తిరుపతి జిల్లా, తిరుపతి మండలం శెట్టిపల్లి పంచాయతీకి చెందిన జంపాల గోపి, ఇర్ల గౌతమ్ లు నేతలకు విజ్ఞప్తి చేశారు.

• నూజివీడు మండలం సిద్దార్థనగర్ గ్రామానికి చెందిన యాదాల శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తూ.. 2018 -2019 లో సీసీ రోడ్ల వర్క్ ను తాను చేస్తే దానికి రావాల్సిన రూ. 44,48,000లను తనకు తెలియకుండా వైసీపీ నేతలు ఆ పనిని తాము చేశామని అధికారులతో కలిసి అక్రమంగా తనకు రావాల్సిన డబ్బులను కొట్టేశారన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు కొట్టేసిన అధికారులు, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అతను విజ్ఞప్తి చేశారు.

• కృష్ణా జిల్లా గూడూరు మండలం కలపటం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తూ… చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన వైసీపీ నాయకులు అయినాల నాగేశ్వరరావు, దేవనాగ శ్రీనివాసరావు, మణికంఠ లు తనపై కక్ష గటి గ్రామంలో సీసీ రోడ్ల కోసం చేసిన వర్క్ పనులకు డబ్బులు రాకుండా అడ్డుకున్నారని… తనను చంపడానికి కారుతో గుద్దారని.. తన ఇంటిని ధ్వంసం చేయడానికి జేసీబీతో వచ్చారని… అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని… తనకు రావాల్సిన వర్క్ బిల్లులు రూ. 40 లక్షలతో పాటు తనపై దాడి చేసిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.

• తాను కాళ్లులేని దివ్యాంగుడినని. తన తల్లిదండ్రులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని వారి మరణాంతరం గ్రామంలో కొంతమంది కబ్జా చేసి తప్పుడు ధ్రువపత్రాలతో ఆక్రమించుకొన్నారని.. ఈ భూ ఆక్రమణపై అధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏంపేడుకు చెందిన డబ్బా వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

• నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం కొండ సముద్రం గ్రామానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాసులు విజ్ఞప్తిచేస్తూ.. తమ కుటుంబం టీడీపీ పార్టీలో ఉండటంతో తమ కుటుంబంపై వైసీపీ నేతలు కక్ష గట్టి అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని.. అక్రమ కేసుల వలన తన కుమారుడు పై చదువులకు వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని.. వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు తొలగించి.. తన బిడ్డ పై చదువులకు విదేశాలకు వెళ్ళడానికి సహకరించాలని గ్రీవెన్స్ లో శ్రీనివాసులు కోరారు.

• అంబులెన్స్ సేవకులుగా పనిచేస్తున్న తమకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని.. 2020 అరవింద సంస్థతో జరిపిన అగ్రిమెంటులో తమ జీతభత్యాల స్లాబ్ సిస్టమ్ అనేది అమలు పేరుతో మోసం చేశారని… వైసీపీ తీసుకువచ్చిన స్లాబ్ సిస్టమ్ పూర్తిగా రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వారు గ్రీవెన్స్ అర్జీని అందించారు.

• ఏపీలోని అన్ని జిల్లాల్లో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న టైమ్ స్కేల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని.. టైం స్కేల్ ఉద్యోగుల మేలు కోసం 2018 లో చంద్రబాబు జి.వో నెంబ్ 142 ను తీసుకొస్తే అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని.. మూడేళ్ళ పాటు జీతాలు లేకుండా పనిచేయించుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్యలను పరిష్కరించాలని గ్రీవెన్స్ లో అర్జీలను అందించారు.

• తిరుపతి జిల్లా కె.వి.బి.పురం మండలం దిగువ పుత్తూర్ గ్రామానికి చెందిన పాఠశాల స్థలాన్ని పలువురు ఆక్రమించుకొంటున్నారని… పాఠశాలకు ప్రహరీ నిర్మించి పాఠశాల స్థలాన్ని కాపాడాలని.. అంతే కాకుండా తమ ఊరిలో అంగన్ వాడీ భవనం శిథిలావస్థకు చేరిందని నూతన అంగన్ వాడీ భవనాన్ని మూంజూరు చేయాలని ఆ గ్రామస్తులు నేడు గ్రీవెన్స్ లో కోరారు.

• 1920 నుండి 2014 ఆగస్టు వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు 2014 లో కాంగ్రెస్ నిలిపేసిందని.. ఆ భూముల సమస్య పరిష్కారానికి గతంలో టీడీపీ ప్రభుత్వం చొరవ చూపిందని.. దానికోసం అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపించారని… తరువాత వచ్చిన వైసీపీ దాన్ని పట్టించుకోలేదని… దాంతో సింగరాయకొండ, సోమరాజుపల్లెల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆ భూములకు యథావిధిగా రిజిస్ట్రేషన్ లు చేసుకొనే అవకాశం కల్పించాలని ఆ గ్రామాల ప్రజలు కోరారు.

గత ప్రభుత్వం ఉన్న పరిశ్రమలు తరిమికొట్టి నిరుద్యోగులకు ఉద్యోగం లేకుండా చేయడంతో నేడు ఉద్యోగాల కోసం వినతులు పట్టుకుని గ్రీవెన్స్ కు యువకులు పోటెత్తారు. తాము దివ్యాంగులమైనా తమకు గత ప్రభుత్వంలో పింఛన్ ఇవ్వలేదని.. తమ అర్హతను గుర్తించి పింఛన్ మంజూరు చేయాలని దివ్యాంగులు అభ్యర్థించారు. తాము నిరుపేదలమైనా కూడా తమకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, ఉండటానికి ఇళ్లు కూడా లేదని.. తమకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని మరికొంత మంది పేదలు వాపోయారు. రేషన్ కార్డు సమస్యలు.. భూ ఆన్ లైన్ సమస్యలు, సీఎంఆర్ ఎఫ్ కోసం వచ్చిన వినతులు ఇలా… అనేక అర్జీలను గ్రీవెన్స్‌లో నాయకులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.