అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

– కమిషనర్ శ్రీనివాసులు

గుంటూరు, మహానాడు: ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం కమిషనర్స గర కాలనీ, రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలుత సగర కాలనీలోని పలు వీధులను పరిశీలించి, స్థానికులను సమస్యల గూర్చి అడిగి తెలుసుకొని, వర్షాలకు నీరు నిల్వకుండా ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.

ప్రాంతంలో మెయిన్ రోడ్ కి చాలా లోతట్టుగా ఉన్నందున లెవల్స్ సేకరించాలన్నారు. అనంతరం రామిరెడ్డి తోట మొదటి లైన్ ని పరిశీలించి, వర్షం వలన డ్రైన్ లోకి వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా రోడ్ల మీదకు రావడం, బురద ఉండడం గమనించి సంబందిత ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్ల మీద ఉన్న బురదను దగ్గర ఉండి కార్మికులతో శుభ్రం చేయించారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రామిరెడ్డి తోట 1వ లైన్ లో నీరు నిల్వ ఉండకుండా, శాశ్వత పరిష్కార మార్గాలతో ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను, డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ ఎం.శ్రీవల్లి, సిటి ప్లానర్ రాంబాబు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఏడిహెచ్ రామారావు, ఏసిపి అజయ్ కుమార్, ఎంహెచ్ఓలు రామారావు, ఆనంద కుమార్, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, డిఈఈ రాము, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.