పోలీసులున్నది ప్రజల కోసమే అనే నమ్మకం పెంచాలి

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, మహానాడు: పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే అన్న నమ్మకాన్ని పెంచాలని, ఫ్రెండ్లీ, సమర్థ పోలీసింగ్‌కు వినుకొండను నమూనాగా తీర్చిదిద్దాలని, గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై సీరియస్‌గా దృష్టి సారించాలని, పాతనేరస్థులపై గట్టి నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై పట్టణ, గ్రామీణ సీఐలు శోభన్‌బాబు, ప్రభాకర్‌తో శుక్రవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమీక్షించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పటిష్ఠం చేసి నేరాలు తగ్గించడంతో పాటు తీవ్రనేరాల విషయంలో ఆ ఆలోచన రావాలి అంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉండాలన్నారాయన.

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు నేరుగా ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. మరీ ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. ఆ విషయంలో రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల నిఘా ప్రయోజనకరంగా ఉంటుందని, ఇదే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఆధునికీకరణపై కూడా అధికారులతో చర్చించారు.