Mahanaadu-Logo-PNG-Large

ఐదేళ్ల పాపాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం !

వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేతలు ఏమైపోయారో?
సునీల్‌పై కేసు ఎప్పుడు?
జవహర్‌రెడ్డిని వదిలేసినట్లేనా?
సజ్జల భార్గవ్‌రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డి వికృత పోస్టింగులు మర్చిపోయారా?
కేంద్ర నిధుల వరద సరే.. క్యాడర్ మనోగతం సంగతేమిటి?
( ఐకియా )

భారీ అంచనాల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం అంచనాలను ఏమేరకు నిలబెట్టుకుంది అన్న విషయానికి వస్తే .. ఐదేళ్లలో జగన్ సర్కార్ చెప్పలేని రాష్ట్ర రాజధాని ఏది అన్న ఒక ప్రశ్నకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నిముషాలలోనే ఎటువంటి ప్రకటన విడుదల చెయ్యకుండానే రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పగలిగింది.

అలాగే గత ఐదేళ్లు పెట్టుబడులు అన్న పేరుకూడా వినపడని ప్రజలకు 50 వేల కోట్ల పెట్టుబడితో బీపీసీల్ ఏపీలో పరిశ్రమను స్థాపించడానికి ముందుకొచ్చింది. గత ఐదేళ్లలో కేంద్ర బడ్జెట్లో వినపడని ఏపీ పేరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 వారాల్లోనే రాజధాని, పోలవరం, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ ల నిర్మాణానికి దాదాపు 50 వేల కోట్ల నిధులను రూపంలో రాబట్టుకోగలిగింది.

ఇలా ప్రజల అంచనాలను నిలబెట్టుకున్న కూటమి.. ప్రభుత్వం పార్టీ కార్యకర్తల, నేతల అంచనాలను నిలబెట్టుకోవడంలో మాత్రం బొక్కబోర్లా పడిందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వంలో హద్దు దాటి ప్రవర్తించిన ప్రతి అధికారి మీద, నోరు జారీ ప్రవర్తించిన ప్రతి వైసీపీ నాయకుడి మీద చర్యలు తప్పవని ఊదరగొట్టిన బాబు, పవన్ లు అధికారం అందగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

దేనికంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాఖల మీద సమీక్షలు అంటూ కొంతమంది అధికారులు, నాయకుల మీద విచారణకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది.

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి, సీబీసీఐడీ డీజి సునీల్ కుమార్, పొన్నవోలు సుధాకర్, మాజీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి వంటి అధికారులు వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేతలు ఏమైపోయారో ఎటువెళ్లిపోయారో తెలియని పరిస్థితి.

వైసీపీ ప్రభుత్వంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ను కూడా ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా 59 రోజుల పాటు జైల్లో నిర్బంధించగలిగారు. కానీ కూటమి ప్రభుత్వం చేతిలో సాక్ష్యాలు, ఆధారాలు, వీడియో ఫోటేజ్ లు ఉంచుకుని కూడా వారిని అరెస్టు చేయలేకపోతోంది.

వైసీపీ సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు గత ఐదేళ్లు అధికారమనే అహంకారం చూపిస్తూ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలనే కాదు పార్టీ నేతలను సైతం ఉక్కుపాదంతో తొక్కారు.

సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టి పార్టీలోని మహిళల నేతలను, కుటుంబంలోని మహిళలని సైతం అవమానించిన వర్రా రవీంద్ర రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వంటి వారి పై ఇప్పటికి చర్యలు తీసుకోలేకపోయింది.

అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వీళ్లంతా రాష్ట్రం దాటిపోయారు అన్న వార్తలు ప్రచారంలో ఉండడంతో అసలు వీరు పారిపోతున్నారు లేక కూటమి ప్రభుత్వం పట్టుకోలేకపోతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
కూటమి ప్రభుత్వం భౌతికంగా విజయం సాధించినప్పటికీ నైతికంగా వైసీపీ నే రాజ్యమేలుతుందా? అన్నట్లుగా కూటమి పార్టీల కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

వర్రా రవీంద్రా రెడ్డి అరెస్టు అంటూ వార్తలు రావడం, ఆ వెంటనే అవి అవాస్తవాలంటూ తేలిపోవడం, వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు అని టీడీపీ పార్టీ శ్రేణులు సంబరపడేలోపే కాదు కాదు వంశీ అనుచరుడు అంటూ వాస్తవాలు బయటకురావడం, వైసీపీ ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అన్నారు ఆ తరువాత రోజు జగన్ తో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రంలో పాల్గొన్నారు.అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్టు చేసి 41నోటీసిలిచ్చి తిరిగి ఇంటికి సాగనంపారు.

బాబు అరెస్టయితే స్వీట్లు పంచుకుంటూ, టపాసులు పేల్చిన రోజా మెల్లగా రాష్ట్ర సరిహద్దులు దాటేసారు.అయినా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. పుంగనూరు లో పసువు చొక్కా వేసుకున్నాడని, టీడీపీ జెండా పట్టుకున్నాడని దారుణంగా అవమానించిన వైసీపీ నేత పెద్దిరెడ్డి అణుకాహారులు మీద ఇప్పటికి చర్యలు తీసుకోలేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే మంత్రి పదవి అన్నట్టుగా దూషించిన పేర్ని నాని, అంబటి రాంబాబు నోటికి ఇప్పటికి తాళం వేయలేకపోతోంది.

జగన్ అనుకున్నట్టుగానే వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే టీడీపీ, జనసేన కార్యకర్తల మాట అటుంచితే పార్టీ అధినేతలైన బాబు, పవన్ లను జగన్ ఉపేక్షించే వారేనా? పెట్టిన పాత కేసులన్నీ తిరగేసి మరికొన్ని కొత్త కేసులు జోడించి పార్టీని, పార్టీ నాయకులను భూస్థాపితం చేసి ఉండేవారేగా? కానీ కూటమి ప్రభుత్వం తన అలసత్వంతో మరోసారి వైసీపీ కి అవకాశం ఇస్తుందా? అనేది ఒక్కసారి పునరాలోచించుకోవాలి.