Mahanaadu-Logo-PNG-Large

నేతన్నలకు చేతినిండా ఆర్డర్లు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పదేళ్ళ సమైక్య రాష్ట్రం కంటే దారుణ సంక్షోభంలోకి చేనేతరంగాన్ని నెట్టేసిన బిఆర్ఎస్
– ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు డబ్బులు చెల్లించకుండా వాళ్ళ బతుకులు బుగ్గిపాలు చేసిన బిఆర్ఎస్
– గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లింపు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– శాశ్వతంగా నేతన్నల జీవన ప్రమాణాల పెరుగుదలకు ప్రణాళికల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు
– మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది
– జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని, గత పదేళ్ళలో చేనేత రంగాన్ని అన్నిస్థాయిలలో అస్తవ్యస్తం చేసి, స్వంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధిచేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
గత ప్రభుత్వం 2018 లో పవర్ లూమ్ కార్మికులకు ఇన్‌పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనాల పరిహార పథకం (10% yarn subsidy ) అనే పథకాన్ని ప్రవేశపెట్టి, నిధులు విడుదల చేయని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చాక నేటి వరకు 33.23 కోట్ల రూపాయల నిధులను నేత కార్మికులకు 10% యార్న్ సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుండి విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పద్దతి ప్రకారం అసలైన నేత కార్మికులకు లబ్ధి చేకురేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మరమగ్గాల మరియు చేనేత మగ్గాల ఆధునీకరణకు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా 2024-25 సంవత్సరానికి కేటాయించబడిన 400 కోట్ల బడ్జెట్ వినియోగించుటకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు తెలిపారు.

అంతేకాకుండా అన్ని ప్రభుత్వశాఖల వారు టెస్కో ద్వారా వస్త్రములను కొనుగోలు చేయుటకు GO.Ms.No.1, dt.11.03.2024 ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఇట్టి ఆదేశముల ప్రకారం టెస్కో నుండి non availability certificate లేకుండా ఏ ప్రభుత్వ శాఖకూడా ప్రైవేటు మార్కెట్ ద్వారా వస్త్రములను కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనివలన వివిధ ప్రభుత్వ శాఖల నుండి సుమారుగా 255.27 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసము రావడం జరిగిందని, అట్టి వస్త్ర ఉత్పత్తి గావించుటకు ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందని మంత్రి తెలిపారు.

మా ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక చేనేత సహకార సంఘాల సభ్యులకు పని కల్పించుటకు, నేటివరకు సుమారుగా 53 కోట్ల విలువైన వస్త్రములను కొనుగోలు చేయడమైనదని, అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘములలో సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యులందరికీ పని కలిపించుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

డిసెంబర్ 2023 నుండి కొనుగోలు చేసిన వస్త్రములకు సంబంధించి పేమెంట్లను వెంటవెంటనే విడుదల చేస్తున్నామని, సమగ్ర శిక్ష పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం 50 శాతం అడ్వాన్సు సుమారుగా 50 కోట్ల రూపాయలు, నూలు కొనుగోలు మరియు సైజింగ్ కొరకు విడుదల చేశామన్నారు. దీని ద్వారా నాణ్యమైన నూలు కొనుగోలు చేసి వస్త్ర ఉత్పత్తులకు సుమారుగా 20.00 కోట్లు విలువైన నూలు సరఫరా చేయటమైనది మరియు NHDC ద్వారా కొనుగోలు చేసిన నూలుఖరీదుకు సంబంధించి 2.96 కోట్లు సంబధిత MACS / SSI Units / Sizing Units కు అడ్వాన్సుగా విడుదల చేయటం జరిగిందన్నారు.

మా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేనేత మరియు మరమగ్గాల కార్మికుల సంక్షేమం కొరకు రివ్యూ చేసి తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘ కాలికంగా లబ్ధి చేకూరేలా పథకాల రూపకల్పన కొరకు ఆదేశించారని, దీనిలో భాగంగానే నేత కార్మికుల స్వయం సమృద్ధి కొరకు నూతన పథకాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా Indian Institute of Handloom Technology (IIHT) ఏర్పాటు, Handloom Park పునరుద్ధరించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నేత కార్మికులకు పొదుపు అలవాటు కల్పించుటకు గాను నేతన్నకు చేయూత పథకం ద్వారా నేత కార్మికులు మరియు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో, 8 శాతం కార్మికుల వేతనంలో చేసిన పొదుపునకు గాను రాష్ట్రప్రభుత్వంచే 16 శాతం నిధులు విడుదల కాబడతాయి. గత ప్రభుత్వం ఈ పథకాన్ని సెప్టెంబర్ 2021లో ప్రారంభించినప్పటికి కేవలం 60 కోట్లు మాత్రమే విడుదల చేసినారు.

ఇవి కేవలం సెప్టెంబర్ 2022 వరకు మాత్రమే కార్మికుల పొదుపు ఖాతాలలోకి జమ కాబడినవి. అక్టోబర్ 2022 నుంచి బడ్జెట్ విడుదల కాకపోవడం వలన 77.80 కోట్ల రూపాయలు అక్టోబర్ 2023 వరకు గత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడలేదు. గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం వలన 36,133 మంది చేనేత కార్మికుల పొదుపు ఖాతాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

నేత కార్మికులకు వేతనాలలో అదనపు వెసులుబాటు కొరకు 2018 లో చేనేత మిత్ర పథకం ప్రారంభించడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం రూ. 100 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. కానీ కేవలం రూ. 40 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇది నేత కార్మికునికి వారి యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం జరిగినది.

ఇవి 2018 నుండి మే 2023 వరకు మాత్రమే 20,501 నేత కార్మికులకు ఇవ్వడం జరిగినది. సెప్టెంబర్ 2023 నుండి ఈ పథకంలో కొంతమార్పు చేసి ప్రతి నేత కార్మికునికి రూ. 2000, అనుబంధ కార్మికులకు రూ. 1000 చొప్పున ఇవ్వడానికి సూచించడం జరిగింది. ప్రభుత్వం నుండి జూన్ 2023 వరకు మాత్రమే నిధులు విడుదల కాబడినవి. గత ప్రభుత్వంలో అక్టోబర్ 2023 వరకు రూ. 19 కోట్లు బకాయిలు ఉన్నవి.

గత ప్రభుత్వం నేతన్నభీమా పథకాన్ని ప్రకటించి నామమాత్రంగా కేవలం 5 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 16 కోట్లు బకాయిల కింద విడుదల కావాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని 10,652 పిట్ లూమ్ లను ఫ్రేమ్ లూమ్ లుగా ఆధునికరించడానికి చేనేత మగ్గం పథకాన్ని 2023 నందు ప్రారంభించి నిధులను విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న 50 శాతం పవర్ సబ్సిడీ పథకాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్విర్యం చేసి 2016 సంవత్సరం నుండి 59 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా బకాయి పెట్టింది.

చేనేత ఉత్పత్తులకు ఈ – మార్కెటింగ్ : గతంలో మంత్రిగా పనిచేసిన ఐటి మినిస్టర్ గారే చేనేత జౌళిశాఖ మంత్రిగా ఉన్నప్పటికి చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ విషయంలో ఏ మాత్రం చొరవ చూపించకపోవటం వలన వారి హయాంలో చేనేత ఉత్పత్తులకు ఈ – మార్కెటింగ్ అమలు కాబడలేదు. మా ప్రభుత్వం ద్వారా ఈ-మార్కెటింగ్ చేయుటకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతూ, చేనేత కార్మికుల ఉత్పత్తుల అమ్మకాలకుగాను వెసులుబాటు కల్పించి వారికి పూర్తి స్థాయిలో వృత్తిపై ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామని తె లిపారు.

నేతన్నలకు మేమే పని కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు నేతన్నలకు చేసిన మోసాలు మచ్చుకు కొన్ని….

1) 2023 బతుకమ్మ చీరల పథకము క్రింద టెస్కో కు చెల్లించవలసిన 351.52 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు, వీటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.100 కోట్లు విడుదల చేయనైనది.

2) సమగ్ర శిక్ష 2023-24 పథకము కింద గత ప్రభుత్వం బకాయి ఉన్న రూ. 108 కోట్లు, వీటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయనైనది.

3) గత ప్రభుత్వం నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వివిధ ప్రభుత్వశాఖలకు సరఫరాగావించబడిన వస్త్రముల బకాయిలు టెస్కోకు చెల్లించవలసి ఉన్నది.

గత ప్రభుత్వ హాయాంలోని అవినీతి, అవలంభించిన అస్తవ్యస్త విధానాల ద్వారా జరిగిన నష్టాన్ని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారని మంత్రిగారు పేర్కొన్నారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ నేతన్నలను, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటున్నారన్నారు.

కానీ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన మోసాలు అన్ని తెలుసని అందుకనే ప్రస్తుతం మీకు ఈ గతి పట్టిందని మంత్రి విమర్శించారు. మీరెన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని లేఖలు రాసిన మిమ్మల్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

జనవరి 2024 నుండి ఇప్పటి వరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న 6 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపి అర్హులైన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించుటకు తగుచర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రిగారు తెలిపారు.
నేత కార్మికులు మరియు మరమగ్గ కార్మికులు స్వయంసమృద్ధి సాధించుట కొరకు దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరే పథకాల రూపకల్పన కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు.

తాత్కాలికమైన రాజకీయ లబ్ధికోసం ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టదని కేవలం నేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధికోసమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. తమ రాజకీయ పబ్బంకోసం వివిధ రాజకీయ పార్టీలు వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ, నేత కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని లేకపోతే ప్రజాజీవితంలో వారికి గుణపాఠం తప్పదని మంత్రి పేర్కొన్నారు.