వైసీపీ పాలనలో చింపిన విస్తరిలా ఆర్థిక వ్యవస్థ!

– ఎన్ని ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్ల సాగుతాయ్‌
– ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు

ఉండి, మహానాడు: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చింపిన విస్తరిలా తయారైందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో కష్టాలలో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికంటే ఎక్కువగానే అన్నా క్యాంటీన్ల ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఉండి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అన్నా క్యాంటీన్ల నిర్వహణ అనేది ప్రజల చేత నడపబడే కార్యక్రమంగా కొద్ది నెలల వ్యవధిలోనే మారాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, క్యాంటీన్ల నిర్వహణకు సహకరించడం ద్వారా, మానవత్వాన్ని చాటుకున్నట్టు అవుతుందన్నారు. కచ్చితంగా నా నియోజకవర్గ పరిధిలో నేను విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం తలపెట్టిన ఈ అద్భుత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రజల చేత… ప్రజల కొరకు… ప్రభుత్వం నడిపే కార్యక్రమం అవ్వాలి
ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వ సహకారంతో నడిపే కార్యక్రమంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ రూపుదిద్దుకోవాలని రఘు రామ కృష్ణంరాజు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున నేను, నాతోపాటు మిగిలిన శాసనసభ్యులు, ముఖ్యమంత్రి ఆలోచనలకు ఒక స్ఫూర్తినిచ్చేలాగా ముందుకు వెళ్తామన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎవరైనా కోటి రూపాయలు విరాళం ఇచ్చేవారు ఉంటారు. కోటి రూపాయలు ఇచ్చినవారికి ఎంత పుణ్యమో వస్తుందో , డబ్బులు లేని పేదవారైనా సరే… పదిమందికి అన్నం పెట్టడం ద్వారా అంతే పుణ్యం వస్తుంది. వారు చేపట్టే కార్యక్రమం కూడా అంతే స్ఫూర్తిదాయకం.

మంచి మనసు ఉన్నదా లేదా అన్నదే ఇక్కడ అవసరమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. పదిమందికి అన్నం పెట్టాలన్నది మన సంస్కృతిలో ఒక భాగమని, ప్రతి మతంలోనూ ఆకలితో ఉన్న ఆపన్నులకు అన్నం పెట్టమనే చెబుతాయని గుర్తు చేశారు. ఆకలితో ఎవరు ఉండకూడదనే, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో ప్రజల సహకారం వల్ల, ప్రభుత్వంపై ఎటువంటి భారం పడకూడదని ఆకాంక్షిస్తున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు
ఉండి నియోజకవర్గ పరిధిలో రెండు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తొలుత ఉండి నియోజకవర్గ పరిధిలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు నిబంధనల ప్రకారం సుముఖతను వ్యక్తం చేయకపోవడంతో, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి ఆకివీడులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించాను. నియోజకవర్గ కేంద్రాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ కేంద్రాలు మున్సిపాలిటీలు కాకపోయినా, మేజర్ గ్రామపంచాయతీలుగా కొనసాగుతూ, మున్సిపాలిటీ లు గా రూపాంతరం చెందడానికి దగ్గరగా ఉంటాయి. అటువంటి కేంద్రాలలో కూడా అన్నా క్యాంటీన్ ల ఏర్పాటు కు చొరవ తీసుకోవాలని సూచించాను.

ఒకవేళ ఉండి నియోజకవర్గ పరిధిలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు నిబంధనల ప్రకారం అనుమతి లభించకపోతే గ్రామ పెద్దలు, రైతులు, దాతల సహకారంతో సామాజిక బాధ్యతగా, నేనే క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాను. అవసరం ఉన్నప్పటికీ అన్నీ చోట్ల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రజలు ముందుకు రావాలని కోరాను. అయితే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు సోమవారం నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు, ఉండి మేజర్ గ్రామపంచాయతీలను పరిశీలించి స్థానికంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు.

ఉండి నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల, అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండు కేంద్రాలలో స్థలం ఎంపిక అనంతరం, అన్నా క్యాంటీన్ల నిర్మాణ స్ట్రక్చర్ పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారన్నారు. నా కోరిక మేరకు ఉండి నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల క్యాంటీన్ ఏర్పాటుకు చొరవ తీసుకున్న మున్సిపల్ మంత్రి నారాయణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఒక్కపూటైన భారాన్ని భరించాలి
సమాజంలో ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవారు అన్నా క్యాంటీన్ల ద్వారా కనీసం ఒక్క పూటైనా తమ తల్లిదండ్రులు జీవించి ఉంటే వారి జన్మ దినోత్సవ రోజు, వివాహ వార్షికోత్సవం రోజున, అలాగే తమ పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా భోజన నిర్వహణ భారాన్ని భరించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. మధ్యాహ్న భోజనం, లేదంటే రాత్రి పూట డిన్నర్ కు అయ్యే ఖర్చును భరించి, అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సహకరించాలన్నారు. తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వర్ధంతుల పేరిట కూడా అన్నా క్యాంటీన్ ద్వారా ఒక పూట భోజనానికి అయ్యే ఖర్చును భరించాలన్నారు.

ముఖ్యంగా విదేశాలలో ఉన్నవారు తమ తల్లిదండ్రులు మరణించి ఉంటే వారి పేరిట కర్మ చేసినా కూడా పది మందికి భోజనం పెట్టాలని పిలిచినా వచ్చే పరిస్థితి ఉండదన్నారు. పూజారులు లేకపోతే సీడీ వేసి కార్యక్రమం నిర్వహించినప్పటికీ, అన్నదానం చేసి తమ తల్లిదండ్రులకు ఆత్మశాంతిని చేకూర్చాలనే వారి కోరిక విదేశాలలో నెరవేరే అవకాశం లేదన్నారు. అటువంటివారు అన్నా క్యాంటీన్లను వేదికగా చేసుకోవాలని సూచించారు. ఒకవేళ తమ పట్టణంలో అన్నా క్యాంటీన్ లేకపోతే, మండల పరిధిలో అన్నా క్యాంటీన్ ఉన్నచోట ఒకపూట భోజనానికి అయ్యే ఖర్చు భరించాలన్నారు.

ల్యాండ్, శాండ్, వైన్ లలో అవినీతి, అక్రమాలు బయటకు రావడం హర్షణీయం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్, శాండ్, వైన్ లలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు వెలుగులోకి రావడం హర్షణీయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వే విభాగానికి చెందిన ఒక జూనియర్ మోస్ట్ అధికారి అయిన వాసుదేవరెడ్డిని మైనింగ్, లిక్కర్ విభాగం బాధ్యతలను ఆనాటి ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. లిక్కర్, మైన్ లలో అక్రమాలు, అవకతవకలపై గత నాలుగేళ్లలో 100 సార్లకు పైగా మాట్లాడుకున్నాం. జూనియర్ మోస్ట్ అధికారికి ఏ ప్రాతిపదికన పెద్ద బాధ్యలను అప్పగించారు?

జే బ్రాండ్స్ అమ్మకం ద్వారా నగదును వసూలు చేశారు. ఒకవైపు ప్రధాన మంత్రి డిజిటల్ కరెన్సీ అంటుంటే, మీరు మాత్రం నగదు…నగదు అని ప్రాకులాడారు. వీటన్నింటి గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వాసుదేవ రెడ్డి రెండు నెలలుగా కనిపించడం లేదన్నారు. బెంగళూరులో దొరికినట్లు, అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వాసుదేవ రెడ్డి దొరికినప్పటికీ, అతడి వ్యవహారాలన్నీ వెలుగులలోకి రావలసిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర మైనింగ్ వ్యవహారాలను చూసిన వెంకట్ రెడ్డి, కోస్ట్ గార్డ్ సర్వీస్ కు చెందిన వారని తెలిపారు. కోస్ట్ గార్డ్ సర్వీస్ కు మైనింగ్ కు సంబంధం ఏమిటో, అతన్ని ఆ సర్వీస్ లకు తీసుకొచ్చిన వారికే తెలియాలి. గనుల వ్యవహారాలను చూసిన వెంకట్ రెడ్డి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నారు.

మైనింగ్ వ్యవహారాలలో చాలా విషయాలు బయటకు రావాల్సి ఉందన్నారు. మైనింగ్, శాండ్స్ వ్యవహారాలను తొలుత చూసిన మధుసూదన్ రెడ్డిని ఆ తరువాత ఫైబర్ నెట్ కు మార్చారు. ఫైబర్ నెట్ లోను ఎన్నో అవకతవకలు జరిగాయి. మధుసూదన్ రెడ్డి వెనక్కి వెళ్లి పోతానంటే, అతడిని సస్పెండ్ చేసి నిలిపారు. గతంలో వెంకట్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వీరందరినీ ఎక్కడి నుంచో ఏరి కోరి ఇటువంటి ఆణిముత్యాలను తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దల అడుగులకు మడుగులొత్తితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని అనుకున్నారేమో కాబోలు, వారిపై చంతాడంత ఆరోపణలు ఉన్నాయి. ఈ ముగ్గురిపైన చాలా స్పష్టంగా ఆరోపణలు ఉన్న దృష్ట్యా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు.

హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ కు అభినందనలు
గత ప్రభుత్వ హయాంలో బాత్రూమ్ ల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించగా, వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించిన హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ కు ఉపాధ్యాయ సంఘాల తరఫున హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నట్టు కృష్ణంరాజు తెలిపారు. గతంలో ఇదే విషయమై ఎన్నోసార్లు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుకున్నాం.

ఉపాధ్యాయులను గౌరవించాలని, ఉపాధ్యాయుల చేత బాత్రూంలో ఫోటోలు తీయించి అప్లోడ్ చేయించడం సరికాదని సూచించినా, అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. బాత్రూంలో పర్యవేక్షణ బాధ్యతను హెడ్మాస్టర్ లకు అప్పగించి వారిని అగౌరవపరిచింది. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు… అగౌరవపరిచారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ విషయంలో స్పందించి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఈ తప్పును సరిదిద్దాలని ఆదేశించారు. వెంటనే నారా లోకేష్, బాత్రూంల పర్యవేక్షణ బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తప్పించారు. గ్రామ సచివాలయం, మున్సిపాలిటీ సచివాలయాలలో విద్యా కార్యదర్శులను పనిచేసే వారికి బాత్రూంలో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. సోమవారం, గురువారం ఫోటోలను తీసి అప్లోడ్ చేసే బాధ్యతలను వారికి మంత్రి నారా లోకేష్ కట్టబెట్టారు. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్న నానుడి ప్రకారం వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలన్నారు.

విజయ్ పాల్ పాత్ర స్పష్టం…
పోలీస్ కస్టడీలో నన్ను టార్చర్ పెట్టిన సంఘటనలో విజయ పాల్ పాత్ర సుస్పష్టం… కోర్టు వద్ద పూర్తి సమాచారం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. విజయపాల్ గతవారం కోర్టులో ఇంట్రిమ్, యాంటీ స్పెటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుంచి విజయ్ పాల్ పరారీ లో ఉన్నాడు. విజయ్ పాల్ ఇంట్రీమ్ బెయిల్ కోసం సిద్దార్థ లూత్ర వాదనలు వినిపించారు.

విజయపాల్ ఎన్నాళ్లు దాక్కుంటాడో చూడాలన్నారు. విజయ్ పాల్ కు ఒకవేళ బెయిల్ లభిస్తే, ఈ కేసులో మిగతా నిందితులు కూడా ఒకరి తర్వాత ఒకరు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారేమోనని అన్నారు. ఈ కేసు త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించిన ఆయన, హెడ్ కానిస్టేబుల్ ఈ కేసు ను విచారించగలరన్నారు. అంత క్లియర్ గా ఉంది. అక్కడేమీ లేదు. కాకపోతే ఈ కేసులో డీజీ స్థాయి అధికారి ఉన్నారు కాబట్టి, డిఐజి స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరిగితే బెటర్ గా ఉంటుందన్నారు. నన్ను తుద ముట్టించాలనే కుట్రలో పోలీస్ శాఖ ఉన్నత అధికారులు కీలక పాత్ర పోషించారన్నారు.

సక్సెస్ ఫుల్ గా పరిమళ వాటర్ స్కీమ్ ట్రయల్
ఉండి నియోజకవర్గ ప్రజలకు మంచినీటి సరఫరా కోసం పరిమళ వాటర్ స్కీం ట్రయల్ రన్ 12 కిలోమీటర్ల పాటు విజయవంతంగా కొనసాగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గణపవరం వద్ద మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పైపులను ఆర్డర్ ఇచ్చారని, పైపులు వస్తాయన్నారు. రెండు గ్రామాలకు నీళ్లు అందించే ఉండి కెనాల్ ఇరువైపులా ఆక్రమణకు గురైందని, ఆక్రమణలను తొలగించి కెనాల్ లో పూడిక తీసి స్థానికులకు మంచినీరు అందిస్తామని తెలిపారు.