తరం వెళ్ళి పోతున్నది..

– ఆ ప్రేమ.. కనుమరుగై పోతున్నది
(వెంకటాచారి)

తరం వెళ్ళిపోతుంది.. ప్రేమ గల పెద్దరికం కనుమరుగై పోతుంది. బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది. జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టి పోతుంది. తెల్లని వస్త్ర ధారణతో.. స్వచ్ఛమైన మనసుతో.. మధురమైన ప్రేమతో.. అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన.. మన ముందు తరం తిన్నగా చేజారి పోతున్నది. వయో భారంతో మనల్ని వదిలి పోతుంది.

హుందాతనపు మీస కట్టు.. రాజహాసపు పంచ కట్టు.. పూటకో తీరు మార్చని మాట కట్టు.. శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు.. తల తెగిన తప్పని నీతి ఒట్టు.. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు.. ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన.. ఒక నాటి మన పెద్ద తరం క్రమంగా కనుమరుగు అవుతుంటే.. హృదయం బరువెక్కుతుంది. మనసు మూగబోతుంది. కంట నీరు కారి పోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. కష్టాలు ఎన్ని చుట్టు ముట్టినా.. సమస్యలు ఎన్నో ఎదురైనా.. అందరూ సామరస్యంగా.. కలిసి మెలిసి.. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునే వారు.

ఒకరికొకరు సహకరించుకునే వారు. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ ఆ తరం కనుమరుగు అవుతున్నది.