అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన

– ఎన్నికలన్ని హామీలు అమలు చేస్తాం
– అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
– హౌసింగ్ పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తాం
– మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అయ్యప్పరాజుపాలెం, మహానాడు: పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి, మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కరపత్రాలను, స్టిక్కర్లను మంత్రితో కలిసి స్థానిక నాయకులు, అధికారులు ప్రతి ఇంటికి అందించారు. ఈ సందర్భంగా కొండపి గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు. బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ, 100 రోజులు పూర్తిచేసుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో 64 లక్షలు మంది సామాజికి పింఛన్ దారులకు 3 వేల రూపాయలు నుంచి 4 వేల రూపాయలకు పెన్షన్ పెంచడమే కాక 3 నెలల బకాయిలను కలిపి 7 వేలు రూపాయలు అందించామన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహరం అందించేందుకు అన్నా క్యాంటిన్లను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 16 వేల 700 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించారని, దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తామన్నారు.

వంద రోజుల పాలనలో జిల్లాలో రూ. 10 కోట్ల రూపాయలతో 3 సాంఘిక సంక్షేమ హాస్టల్ బిల్డింగ్ లకు నిధులు మంజూరు చేశామన్నారు. కొండపిలోని గురుకుల పాఠశాలకు రూ. 13 లక్షల రూపాయలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు 14 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పధకం కింద సిమెంటు రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి రూ.143 కోట్ల రూపాయలు మంజూరైనట్టు మంత్రి వివరించారు. అలాగే 15 కోట్ల రూపాయలతో 5 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేశామన్నారు. 2014-19 కాలంతో 13,616 మంది ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. లబ్దిదారులందరికీ త్వరలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. అక్టోబర్ 1 నుండి అర్హత కలిగిన పెన్షన్ దారులకు పెన్షన్ మంజూరు చేసేలా గ్రామ సభలు నిర్వహించి పెన్షన్ లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.