అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పెన్షన్లు స్వయంగా పంపిణీ చేసిన సీఎం 
గుండుమలలో పెన్షన్ దారుల పరవశం    
సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన ప్రజలు   

మడకశిర (గుండుమల), మహానాడు :  సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మడకశిర మండలంలోని గుండుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథక నగదును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు.

ముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీ సత్యసాయి జిల్లా కు వచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు గుండుమలలో కార్యకర్తలు,అభిమానులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో భాగంగా ఓబులమ్మకు వితంతు పెన్షన్, పులమాసి రామన్నకు వృద్ధాప్య పెన్షన్ ను స్వయంగా సీఎం వారికి అందజేశారు.

పెన్షన్ సాయంతో.. సంతోషంగా ఉన్నాం: ఓబులమ్మ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకతో.. మా కుటుంబం సంతోషంగా ఉంది.  అవ్వ తాతలపై ఉన్న ప్రేమతో  4వేలు పింఛన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.పెన్షన్ తో పాటు.. మా  కుటుంబం ఇతర పథకాల ద్వారా కూడా లబ్ది పొందుతున్నాము. ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం. టీడీపీ  ప్రభుత్వంలో.. సుభిక్షంగా ఉంటామన్న నమ్మకం ఏర్పడింది. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వమే కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం.

ఇల్లు మంజూరు చేయండయ్యా..!

మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓబులమ్మ  భర్త  పది సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. ఓబులమ్మకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరంతా వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. .ఆమె ఇద్దరు కుమారులు కోడలు బెంగళూరులోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో సహాయకులుగా పనిచేస్తున్నారు.  ఆమె వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, చుట్టుపక్కల ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంది. ఆమె ప్రధానంగా  ప్రభుత్వ మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ 4000  రూపాయలు అందుకోవడం ద్వారా జీవనం సాగిస్తోంది. 25 ఏళ్ల క్రితం సొంతంగా నిర్మించిన పాత ఇల్లు కూడా రూఫ్ దెబ్బతింది. పుట్టిన ఈ గ్రామంలో తన పిల్లలకు వ్యక్తిగత ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

4 వేలు పెన్షన్ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: పులమాసి రామన్న

జులై నుంచి రూ.4,000 పెన్షన్ మొత్తాన్ని  అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ధన్యవాదాలు. ఇచ్చిన మాట ప్రకారం  వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఎవరూ పట్టించుకోని మాలాంటి వృద్ధులకు ఈ పింఛన్ ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో నెలనెలా పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ. పడిగాపులు కాసే వాళ్ళం. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి మా ఇంటికే  వచ్చి పెన్షన్ డబ్బులిస్తుంటే చంద్రన్న పండుగులా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

మా పిల్లలకు ఉపాధి కల్పించండయ్యా..!

వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన 70 సంవత్సరాలు వయసు కలిగిన పులమాసి రామన్న వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కూతురు ఉన్నారు. ముగ్గురికి వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు మారుతి ఎంఏ, బీఈడీ పూర్తి చేసి వాటర్ వర్క్స్ విభాగంలో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. అలాగే ఆయన భార్య కామాక్షి బీఎస్సీ బీఈడీ చదివి ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు ఏడవ తరగతి వరకు చదివి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య పూల వ్యాపారం చేస్తూ రోజుకి  30 రూపాయలు సంపాదిస్తోంది. వీరి కుటుంబం క్రమం తప్పకుండా సత్సంగ్ భజన కార్యక్రమాలు చేస్తున్నారు. రామున్నకు జీవనోపాధికి ప్రధాన వనరు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా అందుకుంటున్న వృద్ధాప్య ఫించన్ మాత్రమే. రామన్న స్వగ్రామంలో తన పిల్లలకు వ్యక్తిగత ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతోపాటు బీఎస్సీ బీఈడీ చేసిన తన పెద్ద కుమారుడు, భార్యకు ఉపాధి కల్పించాలని కోరారు.

సీఎం స్పందన

పెన్షన్ దారుల కష్టాలు విన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామన్న కు  భూమితో పాట, వారి బిడ్డలకు ఉపాధి కూడా కల్పిస్తామని,ఓబులమ్మ కు ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన ప్రజలు

అంతకుముందు గురువారం నంద్యాల జిల్లా పర్యటన ముగించుకొని శ్రీశైలం సున్నిపెంట నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి మధ్యాహ్నం  3.45 గం..గుండుమల ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాల హెలిపాడ్ చేరుకున్నారు.అక్కడ  నుంచి రోడ్డు మార్గాన గుండుమల గ్రామానికి చేరుకున్నారు. 4.05 గంటలకు గుండుమలలోని ఓబులమ్మ ఇంటి వద్ద కు చేరుకొని వితంతు పింఛను పంపిణి చేశారు. తదనంతరం పులమాసి రామన్న ఇంటికి వద్దకు చేరుకొని వృద్ధాప్య పింఛన్లు పంపిణీ  చేసిన అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్ ను సందర్శించి పట్టు రైతుతో మాట్లాడారు.

అనంతరం  గుండుమలలో వడి సలమ్మ, కరియమ్మ దేవి దేవాలయాలను సందర్శించారు. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుండుమల గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అనంతరం  గుండుమల నుంచి బయలు దేరి పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ,హిందూపూర్ ఎంపీ బి కే పార్థసారథి,మడకశిర ఎమ్మెల్యే ఏం.ఎస్ రాజు, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు,గుండుమల మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామి,జిల్లా కలెక్టర్ చేతన్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి ఆర్డిఓ సౌభాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.