– గాదె, బోనబోయిన
గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 11 రోజులు పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బాటలోనే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నడిచారు. దీక్ష స్వీకరించిన 4వ రోజు సందర్భంగా జనసేన నాయకులు, వీర మహిళలతో, 32&35 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు రోళ్ల కోటేశ్వరరావు, జెట్టి బాబు, స్థానిక నాయకులతో కలిసి శ్యామల నగర్ లో ఉన్న శ్రీ సంతోషిమాత దేవస్థానంలో ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాదె గారు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు హైందవ సమాజాన్ని కదిలించిందని తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రాయశ్చిత్త దీక్షలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన తిరుమలకు కాలినడకన వస్తానంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వస్తున్నారు అనుకున్నామని, కానీ వారు అక్కడ కూడా మరోసారి రాజకీయానికి తెరలేపారని అన్నారు. ఇలా చేయడం వలనే ప్రజలు ఇంట్లో జగన్‌ను కూర్చోబెట్టారని, ఇప్పటికైనా జరిగిన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్త పడతారు అనుకుంటే మరలా ఈ విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ దీక్ష వలన హైందవ సమాజం అంత ఏకతాటిపైకి వచ్చింది అని అన్నారు. సనాతన ధర్మంపై వైసీపీ ఏ స్థాయిలో దాడి చేసిందో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోందన్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, ఆ సిద్ధాంతానికి తూట్లు పొడిచే లాగా వైసీపీ ప్రవర్తించింది అని అన్నారు.
ఇప్పటికీ వైసీపీ అధ్యక్షుడు మారకుండా, తిరుపతి యాత్రను రాజకీయ యాత్రలా వాడుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలైన లౌకికవాదాన్ని నేడు జనసేన పార్టీ చేసి చూపిస్తోందన్నారు.