రెవెన్యూ అధికారులకు అధికారంతో సమస్యలు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య
గుంటూరు, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య పేర్కొన్నారు. జనచైతన్య వేదిక హాలులో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు – సమస్యలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ చట్టంలో చెప్పిన నిర్ధిష్ట కాలంలో లీజులు, తనఖాలు, ఇతర అన్యాక్రాంతాలు, క్రయ విక్రయాలను భూమి ఆస్తి హక్కు అధికారి వద్ద నమోదు చేయడంలో ఆస్తి యాజమానులు విఫలమైతే ఆరు నెలల జైలుశిక్ష లేదా 50 వేల జరిమానా విధించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ స్థానాల నుంచి తొలగించి ప్రభుత్వ కనుసన్నలలో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారా లను సంక్రమింప చేయటం వల్ల అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.
ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపణీయమన్నారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.దివాకర్‌బాబు ప్రసంగిస్తూ భూహక్కు కొత్త చట్టం దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు, నిరక్షరాస్యుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందన్నారు. లబ్ధిదారుల పేర్లలో మార్పులు, చేర్పులు సంబంధిత రిజిస్టర్లో చేర్చినప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించి చేతులు దులుపుకోవడం హాస్వాస్పదమన్నారు.
ఎక్కడా లేని చట్టం ఇక్కడ ఎందుకు?
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రజలలో ఎలాంటి చర్చ జరపకుండా హడావుడిగా భూహక్కు చట్టాన్ని తీసుకురావడాన్ని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయకపోయినా ఇక్కడ దేనికోసమని ప్రశ్నించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం చేతిలో భూహక్కు చట్టాన్ని ఉంచటం, న్యాయవ్యవస్థను దూరంగా ఉంచటం సహేతుకం కాదన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ ఉన్నత న్యాయస్థానాలు భూహక్కు విషయాలలో ఇచ్చిన తీర్పులను ఏడు రోజులలో అధికారుల వద్ద నమోదు చేసుకోకపోతే ఆ తీర్పులను అంగీకరించలేమని పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. భూ హక్కుదారులు అధికారుల వద్ద తగిన దరఖాస్తులు చేసుకున్న తర్వాత రెండేళ్ల తర్వాత మాత్రమే వారికి యాజమాన్య హక్కు గుర్తించబడుతుందని చెప్పడం ద్వారా వారు రుణాలు పొందడానికి, క్రయవిక్రయాలకు అవకాశం కోల్పోతారని తెలిపారు.
హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసులు ప్రసంగిస్తూ ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా నీతి ఆయోగ్ రూపొందించిన నమూనా చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు పొందుపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ హక్కు చట్టాలను రూపొందించడాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పౌర హక్కుల సంఘం నేత పి.రాజారావు, ప్రోగ్రెసివ్ ఫోరం నేత పి.వి.మల్లికార్జునరావు, మానవత చైర్మన్ పావులూరి రమేష్, రేటు పేయర్స్ అసోసియే షన్ జిల్లా అధ్యక్షుడు ఓ.నారాయణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్.సుబ్రహ్మణ్యం, బార్ అసోసి యేషన్ మాజీ అధ్యక్షుడు కె.వి.కె.సురేష్, చిగురుపాటి రవీంద్రబాబు, చుక్కపల్లి రమేష్, హైకోర్టు న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.