దాతల దాతృత్వంతో పల్లెల్లో ప్రగతి వెలుగులు

– మారెళ్ళలో పవర్ జనరేటర్ ప్లాంట్ ప్రారంభం
– సినీనటుడు అశోక్‌ కుమార్‌ ఔదార్యం

మరెళ్ల, మహానాడు: దాతల దాతృత్వంతో పల్లెల్లో ప్రగతి వెలుగులు నిండుతున్నాయని, ఇందుకు కూటమి ప్రభుత్వం సహకరిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో ప్రముఖ సినీ నటుడు అశోక్ కుమార్ సహకారంతో సోలార్ పవర్ జనరేటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వీరు ముఖ్యఅతిథులు విచ్చేసి, మాట్లాడారు. అశోక్ కుమార్ మారెళ్ళ గ్రామాన్ని ఎంపిక చేసుకొని పవర్ జనరేటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని వెల్లడించారు. వివిధ రంగాలలో అభివృద్ధి చెందిన అనేకమంది ప్రముఖులు అశోక్ కుమార్ బాటలో పయనించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గ్రామాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు గ్రామ సభలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించి అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.