ఆలయాలపై దాడులకు తెగబడ్డ ఉన్మాదులను కఠినంగా శిక్షించాలి

– ‘హైందవ శంఖారావం’ సన్నాహక సమావేశంలో వక్తలు డిమాండ్‌

గుంటూరు, మహానాడు: విజయవాడలో జనవరి అయిదోతేదీన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. దీనికి సంబంధించి సన్నాహక సమావేశం ఆదివారం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో జరిగింది. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే లోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణల గురించిన డిమాండ్ కై జనవరి 5, 2025 తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.

దేవాలయాలలో దేవాలయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులు తొలగించాలని, దేవాలయాలన్నింటా పూజా ప్రసాద కైంకర్య సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలని, దీని ఉల్లంఘనకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా మరికొన్నింటిని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి.

దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారుచేసిన నమూనా విధివిధానాలను అమలు చేయాలి. దేవాలయాల పరిసరాల్లోని దుకాణాలు అన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలి. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతం అయిన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విదర్మీయులు, విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి.

హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్తుల ద్వారా అక్రమంగా నిర్మింపబడ్డ కట్టడాలన్నీ వెంటనే తొలగించాలి. దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి, సేవలకు మాత్రమే ఉపయోగించాలి, ప్రభుత్వ ప్రజాపాలనా కార్యాలకు వినియోగించరాదని వక్తలు డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్ఎస్ఎస్) రాష్ట్ర ప్రచారక్ విజయాదిత్య, జిల్లా కన్వీనర్ వంగా జనార్దన్ రెడ్డి, మాధవరెడ్డి, గోపికృష్ణ, వివిధ క్షేత్రాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు.