Mahanaadu-Logo-PNG-Large

ముందుమాట ‘మందు’మాటయింది!

– ఖజానాకు ఆ ‘కిక్కే’ వేరప్పా!
– మద్యనిషేధంపై మాట తప్పిన జగనన్న
– మద్యనిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్న డైలాగు
– ఐదేళ్లలో మద్యం ఆదాయంతో ఖజానాకు కిక్కు
– తాగుబోతులను తాకట్టుపెట్టిన జగన్ సర్కారు
– తాగుబోతుల జేబు చూపించి 40 వేల కోట్ల అప్పు

– మాట తప్పిన జగనన్నపై అక్కాచెల్లెమ్మల మండిపాటు

చైనాలో పిచ్చుకలు ఏడాదికి 6.5 కేజీల బియ్యం తింటున్నాయని ప్రభుత్వం గ్రహించింది. ఆ బియ్యాన్ని కాపాడితే సుమారు 60 వేలమందికి ఆహారం దొరుకుతుందని భావించింది. దానితో సుమారు 30 లక్షల పిచ్చుకలను చంపేసింది. వాటి గుడ్లను పగులకొట్టేసింది. అయితే దానివల్ల పంటలకు పురుగుపట్టి, తినడానికి తిండిదొరక్క ఆ తర్వాత 1958-61 సంవత్సరాలలో తీవ్రమైన కరువు వచ్చింది. 4.5కోట్ల మంది చనిపోయారు. కళ్లు తెరిచిన చైనా కమ్యూనిస్టులు, రష్యా కమ్యూనిస్టు సర్కారు సాయం, అడిగి లక్షల సంఖ్యలో పిచ్చుక గుడ్లు దిగుమతి చేసుకుందట.

ఈ కథ ఈ ఎన్నికల సమయంలో ఎందుకనే కదా మీ డౌటనుమానం? చైనా పిచ్చుకలకు-ఆంధ్రా మందుకు బాదరాయణ బంధం ఉంది మరి. ఎలాగంటారా?.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్.. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్ మంత్రి అంబటి రాంబాబు శాసనసభలో చేసిన ప్రసంగానికి, చైనాలో పిచ్చుల హత్యలకు పోలిక ఉంది కాబట్టే ఈ కథ!

ముందుమాట ‘మందు’మాటయింది. గత ఎన్నికల ముందు.. ‘సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసిన తర్వాతనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. కేవలం స్టార్ హోటళ్లకు మాత్రమే దానిని పరిమితం చేసి అక్కా షెల్లెమ్మల ముఖంలో షిక్కటి షిరునవ్వు చూస్తా’ అని, జగన్ ఎన్నికల సభలో హామీలు గుప్పించారు. మహిళలు-అవ్వా తాతలు, జగనన్న చెప్పింది నిజమేనని నమ్మి వైకాపాకు ఓట్లు కుమ్మేశారు.

అధికారంలోకి వచ్చిన జగనన్న ప్రభుత్వం వైన్‌షాపులు రద్దు చేసింది. ఇంకేముంది? మాటతప్పడం- మడమ తిప్పడం అలవాటులేని షీఎం జగనన్న.. తన మాట నిలబెట్టుకునే పని మొదలుపెట్టారని, ‘అక్కషెల్లెమ్మలు షిక్కటి షిరునవ్వు’లు చిందించారు. ఆ తర్వాతే మొదలయింది అసలు కథ. మూయించిన వైన్‌షాపుల స్థానంలో, సర్కారు మందు షాపులు పెట్టించారు. పోనీ అందులో మందుబాబులు తాగే రెగ్యులర్ బ్రాండ్లు ఉన్నాయా? అంటే అవీ లేవు. అన్నీ జే బ్రాండ్లేనన్నది మందుబాబుల గోస.

జగనన్న పార్టీకి ఎన్నికల ముందు పెట్టుబడి పెట్టిన, ‘రాయలసీమ పెద్దారెడ్ల’ చేతికి డిస్టలరీస్.. ఆదాయ వ్యవహారాలను చెన్నై తమ్ముడు అనిల్‌కు అప్పగించారన్నది విపక్షాల ఆరోపణ. ఇంకేముంది? రకరకాల బ్రాండ్లు సర్కారు వైన్‌షాపుల్లోకి చేరేశాయి. అలాంటి బ్రాండ్లు ఆంధ్రాలో తప్ప, ప్రపంచంలో ఎక్కడా దొరకవు. అలాంటి నాసిరకం మందు ధరలను కూడా, జగన్ సర్కారు ఆకాశమంత పెంచింది. చివరకు బయట రాష్ట్రాల నుంచి లిక్కరు రాకుండా, సరిహద్దులో పోలీసు కాపలా పెట్టిమరీ.. చచ్చినట్లు జే బ్రాండ్లు మాత్రమే కొనేలా చేసింది. గత ఐదేళ్ల నాటి చంద్రబాబు హయాంలో.. క్వార్టర్ ధర నాణ్యమైనది కేవలం 60 రూపాయలుంటే, జగనన్న సర్కారు దానిని ఏకంగా 600 రూపాయలకు పెంచింది.

నాసిరకం మందు తయారుచేస్తున్న కంపెనీలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని, అందులో ప్రాణాంతకమైన రసాయనాలున్నాయని ఎంపి రఘురామకృష్ణంరాజు అప్పట్లో, తానే స్వయంగా చెన్నై ల్యాబ్ ఇచ్చిన ఫలితాలు బయటపెట్టారు. సర్కారు షాపుల్లో అమ్ముతున్న మద్యంలో.. ఎంత శాతం ప్రమాదకరమైన రసాయనాలున్నాయి? అవి తాగితే ఏయే రోగాలు వస్తాయో స్పష్టంగా వెల్లడించారు.

జగన్ తనకు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన రెడ్డి కులస్తుల పొట్ట నింపేందుకు.. పేదప్రజల పొట్టకొట్టడమేకాకుండా, ఆడవారి తాళిబొట్లు తెంపుతున్నారని ఎంపి రాజు అప్పట్లో నానా యాగీ చేశారు. దానితో కదిలిన సర్కారు.. అబ్బే సర్కారీమందు ప్రమాదమేమీకాదు. అమృతంతో సమానమని మహదానందంతో సర్టిఫికెట్ ఇచ్చింది.

అయితే జగనన్న సర్కారు అమ్ముతున్న నాసిరకం మందు వల్ల.. దాదాపు 30 లక్షల మంది ఆరోగ్యం నాశనం చేసుకున్నారని.. అందులో 30 వేలమంది మరణించినందున అది జగన్‌సర్కారు హత్యలేనని, టీడీపీ మహిళా ఎమ్మెల్సీ అనురాధ అప్పట్లోనే ఆరోపించారు. చంద్రబాబు హయాంలో మద్యం ధరలపై బాటి ళ్లను చూపించి మరీ లెక్చరిచ్చిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌గానీ, అసెంబ్లీలో నానా గత్తర చేసి మద్యం బాటిళ్లు పగులకొట్టిన రోజా గానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మందుధరలు-నాణ్యతపై మాట్లాడితే ఒట్టు.
సర్కారు మద్యం షాపుల్లోని నాసిరకం మందు తాగితే.. అందులోని విషరసాయనాల ఫలితంగా త్వరగా చనిపోతారని చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్ ఒక నివేదిక ఇచ్చింది.

దేశంలోని పాన్‌షాపుల్లో ఒక పాన్ తీసుకున్నా, డిజిటల్ పేమెంట్లు తీసుకుంటున్నారు. చివరకు ఆటో, ఊబర్, వోలో వంటి వాటిలో కూడా డ్రైవర్లు స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్లు తీసుకుంటున్నారు. అది ఆఖరకు తోపుడుబండ్లపై, కూరగాయలు అమ్ముకునే వారికీ అందుబాటులోకి వచ్చింది. కానీ జగనన్న సర్కారు మాత్రం మందుషాపుల్లో డిజిటల్ పేమెంట్ విధానం పెట్టకపోవడమే వింత.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఉపన్యాసాలిచ్చిన జగన్, ఆర్ధిక మంత్రి, అధికారులు.. సర్కారు మందుషాపుల్లో వాటిని అమలుచేయకపోవడమే జోక్. అయితే సర్కారు మందుషాపుల్లో అమ్మే డబ్బు.. ఎవరికి? ఎలా? ఎక్కడికి పోతుంది? సర్కారు ఖజానాకు పోతుందా? లేక తాడేపల్లి మీదుగా మరెక్కడికయినా రవాణా అవుతుందో ఇప్పటికీ తెలియని బ్రహ్మరహస్యం. అది వేరే కథ.

సీన్ కట్ చేస్తే.. మందుధరలపై అసెంబ్లీలో జరిగిన రసవత్తరమైన చర్చకు, మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘మద్యం తాగాలంటే షాక్ కొట్టి భయపడేంత ధరలను కావాలనే పెంచాం. అది మద్యం తాగాలన్న కోరికను చంపేస్తుందని’విచిత్రమైన భాష్యం ఇచ్చారు. ఆ తర్వాత అంబటి వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలిపోయాయి. ‘జనాలు రోడ్డున అనవసరంగా తిరిగి బండ్లు పాడుచేసుకుంటున్నారనే జగనన్న రోడ్లను బాగుచేయించడపం లేదు’.. ఇసుకను వృధా చేస్తున్నారని దానిని ఆదా చేసేందుకే ఇసుక రేట్లు పెంచేశారేమో’ అని వెటకారాలాడారు.

ఇక మూడుదశల్లో మద్యనిషేధం అమలు చేసిన తర్వాతనే, ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న జగన్.. రాష్ట్రంలోని తాగుబోతులను తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం పెద్ద కామెడీ. లాక్‌డౌన్ తర్వాత మద్యం ధరలు పెంచిన సర్కారు, తర్వాత బార్ లైసెన్సు ఫీజుల ద్వారా 180 కోట్ల ఆదాయం సంపాదించుకుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలాపెట్టించిన ఘనత జగన్ కే దక్కింది.

లాక్‌డౌన్ తర్వాత చిల్లరదుకాణాలు కూడా కరోనా భయానికి షాపులు తెరవలేదు. అయితే జగనన్న ప్రభుత్వం మద్యం షాపులను మాత్రం తెరిపించింది. దటీజ్ జగనన్న! బేవరేజెస్ కార్పొరేషన్‌ను తాకట్టు పెట్టి.. 22 వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న జగన్ సర్కారు.. మద్యపాన నిషేధం ప్రకటిస్తుందనుకోవడం ఓ జోక్ అన్నది ఆర్ధికవేత్తల ఉవాచ.

మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి.. వచ్చే 15 ఏళ్లకు 39,705 కోట్లు బ్యాంకుల్లో అప్పులు తెచ్చారు. మద్యంపై ఇన్ని వేల కోట్లు ఆదాయం సంపాదిస్తూ, లక్షలాదిమందిని తాగుబోతుల జేబు గుల్ల చేస్తున్న జగన్ సర్కారు, కనీసం డీఅడిక్షన్ సెంటర్లు కూడా ప్రారంభించకపోవడం మరో విశేషం. ఇన్ని వింతలు-విశేషాలతో, రాష్ట్రాన్ని మద్యంతో విజయవంతంగా నడిపిస్తున్న జగనన్న సర్కారు.. మద్యనిషేధం విధిస్తుందనుకునే వారు, తలకుమాసినవారే లెక్క అన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య.

‘‘ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని తాగుబోతులందరినీ తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత మద్యనిషేధం విధిస్తుందని నమ్మిన వారు వెర్రివాళ్లు కింద లెక్క’’ అని బీజేపీ అధికార ప్రతినిధి, చార్టెట్ అకౌంటెంట్ కూడా అయిన లంకా దినకర్ ఎద్దేవా చేశారు.

సో.. అప్పట్లో అసెంబ్లీలో అంబటి చెప్పిన కథకు-చైనాలో పిచ్చుకలు పెరుగుతున్నాయంటూ వాటిని తగ్గించేందుకు, చైనా సర్కారు చేసిన పిచ్చుకల హత్యకు బాదరాయణ బంధం ఉందని ఇప్పుడు అర్ధమయిందా? పిచ్చుకలు ఎక్కువుంటే బియ్యం తినేస్తాయని చైనా సర్కారు వాటిని చంపేసింది. ఆంధ్రాలో తాగుబోతుల సంఖ్యను తగ్గించాలన్న మహత్తర లక్ష్యంతో మద్యం ధరలు పెంచి, ఖజానాను పెంచుకుందన్నమాట!