-కేవలం ఆదాయాన్ని కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే..
– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ప్రభాకర్
హైదరాబాద్,మహానాడు: ప్రజాభిప్రాయానికి భిన్నంగా, అధికారాన్ని కేంద్రీకృతం చేయాలనే యావతో కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న స్థానిక సంస్థల విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నట్లు డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తెలిపారు. నిపుణుల సూచనలు తీసుకోకుండా, సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించకుండా జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంపై ఆయన తప్పుబట్టారు.
15 ఏళ్ల కిందట హైదరాబాద్ శివారులోని ఉప్పల్, కాప్రా, కుత్బుల్లాపూర్ లాంటి మున్సిపాలిటీలను విలీనం చేసినా.. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిరదని మండిపడ్డారు. మరోవైపు హైదరాబాద్ మహానగరం మ్యాన్‌హోల్ మరణాలకు, కుంగిన నాలాలకు, కూలుతున్న కాలుతున్న భవనాలకు, ట్రాఫిక్ జాంలకు, కాలుష్య కోరలకు కేరాఫ్‌గా మిగిలిందన్నారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు.. నిజాం కాలంనాటి భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించకపోవడం, చెరువుల పూడిక తీయకుండా, సుందరీకరణ జరపకుండా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.
కేవలం ఆదాయాన్ని కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేయాలనే ఆలోచన చేస్తోందని విమర్శించారు. ముందు స్థానిక ప్రజాభిప్రాయం తీసుకోవాలని, సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా సంబంధిత పార్లమెంటు సభ్యులు, స్థానిక పురపాలక సంఘాల చైర్మన్లు, కౌన్సిలర్లతో, కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లతో విస్తృత స్థాయి చర్చలు జరిపిన తర్వాతే అడుగు ముందుకు వేయాలని హెచ్చరించారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, పౌరుల నిర్ణయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తగిన కార్యాచరణతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.