విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు
ఇంకే ఉచితాలు అవసరం లేదు
భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
యువతరం ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని సూచన
స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ లో ఉచిత వైద్య శిబిరం
విజయవాడ: ప్రజలకు విద్య,వైద్యం ఉచితంగా అందిస్తే చాలని, మరింకే ఉచిత పథకాలు అవసరం లేదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ఆత్కూర్లో ఆదివారం గుడివాడకు చెందిన ఈవిఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వాలు ఓట్ల కోసం, తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం అవసరం లేని ఉచిత పథకాలు తీసుకొస్తున్నాయని, దీనివల్ల ప్రజలకు దీర్ఘకాలికంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అన్నారు.
” ఆకలితో ఉన్న వ్యక్తికి చేపలు ఇస్తే అప్పటికి తృప్తి చెందుతాడు. అదే వ్యక్తికి చేపలు పట్టడం నేర్పిస్తే, తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు పట్టుకోగలడు. ఇదీ అసలైన సంక్షేమం అంటే. యువత తమ కాళ్ళపై తాము నిలబడగలిగేలా నైపుణ్య శిక్షణ ఉచితంగా అందిస్తే ఆత్మగౌరవంతో బతకగలరు. లేదంటే ఎప్పుడూ చేయి చాచే పరిస్థితిలోనే ఉంటారు. ఇది నిజమైన సంక్షేమం కాదు. ప్రజలు చేయి చాచే పరిస్థితిలో లేకుండా ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే అసలైన సంక్షేమం. ప్రభుత్వాలు ఈ దృష్టి కోణంలో ఆలోచించాలి.” అని సూచించారు.
తల్లిదండ్రులు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవటంతో పాటు, పిల్లలకు అలవాటు చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. పాశ్చాత్య జీవనశైలి మోజును విడనాడి ఆరోగ్యకరమైన భారతీయ జీవనశైలికి మారాలన్నారు. సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడంతోపాటు తగిన శారీరక శ్రమ చేయాలని సూచించారు.
యోగ, వ్యాయామం, ఆటలు వంటి శారీరక శ్రమతో, తాజాగా వండిన సంప్రదాయ భారతీయ వంటకాలతో శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. రాత్రి త్వరగా నిద్రపోవాలని, టీవీలు, ఫోన్లు ఎక్కువగా చూడకూడదని చెప్పారు. టీవీలు, ఫోన్ల వాడకం పెరిగితే మనసులో అలజడి చెలరేగుతుందని, మానసిక అశాంతి పెరుగుతుందని స్పష్టం చేశారు.
శరీరం మనసు రెండిటికి,పరస్పర సంబంధం ఉందని, శరీరం ఆరోగ్యంగా ఉంటే, మనసు ఆరోగ్యంగా ఉంటుందని, మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలతో పిల్లలు ఎక్కువగా సమయం గడపాలని, వారు ఎన్నో విలువైన జీవిత పాఠాలు నేర్పిస్తారని, కుటుంబ బంధాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.
స్వర్ణ భారత్ ట్రస్ట్ 23 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు, యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోందని, దీనివల్ల యువతరం నాలుగు నెలల్లోనే ఆత్మవిశ్వాసంతో తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబానికి అండగా ఉంటున్నారని చెప్పారు.
స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్, ఆత్కూరు లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ శిబిరంలో పాల్గొని సేవలందించిన గుడివాడ ఈ వి ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన గుండె,మెదడు, నరాలు, క్యాన్సర్, ఉదరకోశ వైద్య నిపుణులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సలహాల కోసం వచ్చిన వారికి ఉచిత వైద్య పరీక్షలతో పాటు, ఉచిత భోజన సదుపాయం, వారానికి సరిపడా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.