ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
మాజీ ముఖ్యమంత్రి జగన్ జమానా అరాచకాల ప్రక్షాళనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు తొలి అడుగు మాత్రమే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఒక్కసంతకంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారంటేనే జగన్‌రెడ్డి నాడు తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవచ్చన్నారాయన. అదే కారణంగా ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టినా ఇంకా ఆ రాక్షసచట్టం మంచిదేనంటూ జగన్ సమర్థించుకోవాలని చూస్తుండడం అతడి విపరీత మానసికస్థితికి నిదర్శనమన్నారు. ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకం చేస్తూ కబ్జాకోరులకు కొమ్ముకాసేలా వైసీపీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం పట్ల శనివారం చిలకలూరిపేట తెదేపా న్యాయ విభాగం సభ్యులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్థించదని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న రాజకీయపరమైన విధాన నిర్ణయంతో పాటు సమిష్టి పోరాటాల ఫలితమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఆందోళనలు, నిపుణుల అభిప్రాయల మేరకే ప్రజల స్థిరాస్తులకు ముప్పు ఉందని గుర్తించి కూటమి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ సంతకం చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు అని చంద్రబాబు తన తొలి చర్యలతో చెప్పకనే చెప్పారన్నారు. ఇదే తరహాలో గడిచిన అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజాకంఠక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించబోతున్నారని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వం చెప్పినట్టల్లా తలాడించి వాటన్నింటిలో భాగం పంచుకున్న అధికారులూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలకు అన్యాయం చేసే చీకటి చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో న్యాయవాదులు 100 రోజులపాటు పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ప్రత్తిపాటి వారందరికీ అభినందనలు తెలియజేశారు.
ప్రత్తిపాటి పుల్లారావుకు అభినందనలు
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును శనివారం పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. చిలకలూరిపేట నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రత్తిపాటిని ఘనంగా సత్కరించారు. ఏఎంజీ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ కంటి మహంతి, సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ప్రత్తిపాటిని కలిసి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రారంభోత్సవాన్ని పురష్కరించుకొని విద్యార్థులకు ప్రత్తిపాటి చేతుల మీదుగా కిట్లను అందించారు.