– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హై స్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరిశీలించారు. నిన్న ఈ హాస్టల్ లోని నలుగురు విద్యార్థులను వేధిస్తున్నారని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని, క్షేత్ర స్థాయిలో తాను పరిశీలించటానికి వచ్చానని మీడియాకు తెలిపారు. విద్యార్థినులతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం అడిగితెలుసుకున్నారు. రెండేళ్ళ నుంచి ఇలాగే జరుగుతోందని, గంజాయి బ్యాచ్ నేరుగా వసతి గృహంలోకి వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినుల ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలు వస్తున్నాయని, ఆహారం కూడా సరిగ్గా ఉండటం లేదని, మరుగు దొడ్లకు సరయిన డోర్లు లేవని, వార్డెన్, నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కోరబోతున్నట్టు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.