సీఎం కంటే.. సెక్రటరీనే ‘పవర్’ఫుల్లట

– బాబు.. లోకేష్ కంటే సీఎంఓ సెక్రటరీ ప్రద్యుమ్న సుప్రీం
-మూడునెలలు దాటినా బాబు, లోకేష్ పీఆర్వోలకు దక్కని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు
– వారు ఇంకా ప్రైవేటు జీతగాళ్లగానే చెలామణి
– అసలు ఇప్పటిదాకా సీపీఆర్‌ఓనే నియమించని వైనం
– బాబు సెక్రటరీ ప్రద్యుమ్న పీఆర్వోలకు మాత్రం రెండు సీఎం మీడియా కో ఆర్టినేటర్స్ పోస్టులు
– నెలకు 90 వేల జీతంతో జీఓ జారీ
– లేని నిబంధనలు సృష్టించి ఇద్దరికి సీఎం మీడియా కోఆర్డినేటర్ పోస్టులు
– క్యాబినెట్ అనుమతి లేకపోయినా బేఖాతర్
– సీఎంఓ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోనూ లేని పోస్టులపై ప్రద్యమ్న అత్యుత్సాహం
– పాత జీఓలు చూపి కొత్త జీఓలు
– బాబు, లోకేష్‌ను ప్రద్యుమ్న అవమానిస్తున్నారా?
– ఐఏఎస్‌లు తలచుకుంటే ఏమైనా చేస్తారా?
– ప్రద్యుమ్న తీరుపై పార్టీ సీనియర్ల అసహనం
– గతంలోనూ ప్రద్యుమ్న తీరుపై విమర్శలు
– వైసీపీ లీగల్ సెల్‌లో పనిచేసిన ఆయన భార్య ఫొటోలు వైరల్
– వైసీపీ నేతలకు టీటీడీ లెటర్లపై సోషల్‌మీడియాలో విమర్శల వెల్లువ
– అయినా తీరు మారని ప్రద్యుమ్నపై అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

కూటమి అధికారంలోకి వచ్చి మూడునెలలు దాటింది. అయినా ఇప్పటిదాకా సీఎం సీపీఆర్‌ఓగా ఎవరినీ నియమించ లేదు. సీఎం చంద్రబాబునాయుడు విపక్షనేతగా.. గతంలో ఆయన దగ్గర పనిచేసిన ఇద్దరు పీఆర్వోలే, ఇంకా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ దగ్గర సుదీర్ఘకాలం నుంచీ, ప్రైవేట్ పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తే.. ఇప్పటికీ ఎలాంటి అపాయింట్‌మెంట్ ఆర్టర్ లేకుండా పనిచేస్తున్నారు. అంటే వారు ఆర్డర్లు లేకుండానే, ప్రైవేటుగానే పనిచేస్తున్నారన్న మాట!

కానీ.. సీఎంఓలో సీఎం సెక్రటరీగా పనిచేస్తున్న ప్రద్యుమ్న అనే ఐఏఎస్ అధికారి.. తన దగ్గర పనిచేసే ఇద్దరు ప్రైవేటు పీఆర్వోలకు మాత్రం, అధికారికంగా ‘సీఎం మీడియా కో ఆర్డినేటర్’ పోస్టు సృష్టించి, నెలకు 90 వేల జీతం ఇస్తూ జీఓ జారీ చేశారు. మరి ఇక్కడ సీఎం గొప్పా? ఆయన దగ్గర పనిచేసే సెక్రటరీ గొప్పా?.. మంత్రి గొప్పా? ఒక ఐఏఎస్ అధికారి గొప్పనా? అన్నది ప్రశ్న.

అంటే సీఎం-మంత్రులు చేయలేని పనిని.. ఒక ఐఏఎస్ అధికారి అవలీలలగా చేయగా లేనిది, సీఎం-మంత్రి ఎందుకు చేయలేరన్న సంకేతం ఇచ్చినట్లే కదా?.. ఇది వారిద్దరినీ అవమానించడమే కదా? అసలు సీఎంఓలో ఏం జరుగుతోంది? సీఎంకు సైతం తెలియకుండా, అధికారులు ఎలా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు? ఇదీ ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్.

చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మూడునెలల దాటింది. అయితే ఇప్పటిదాకా ఆయన సీఎం సీపీఆర్వోను నియమించలేదు. గతంలో ఆయన విపక్షనేతగా ఉన్నప్పుడు పీఆర్వోలుగా పనిచేసిన రమేష్, కిశోర్ అనే పీఆర్వోలే చంద్రబాబు వద్ద సీఎం పీఆర్వోలుగా కొనసాగుతున్నారు. ఇక మంత్రి లోకేష్ వద్ద చైతన్య, సుదీర్ఘకాలం నుంచి వ్యక్తిగత పీఆర్వోగా పనిచేస్తున్నారు. చైతన్య గతంలోనూ లోకేష్ మంత్రిగా చేసినప్పుడు, అధికార పీఆర్వోగా పనిచేశారు.

వీరంతా ఇప్పుడూ బాబు-లోకేష్ వద్ద పీఆర్వోలుగానే కొనసాగుతున్నారు. అయితే అధికారికంగా ఈ ముగ్గురికీ ఇప్పటిదాకా ఎలాంటి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు లేవు. వారికి ఇప్పటిదాకా పార్టీనే జీతాలిస్తున్నట్లు సమాచారం.

అయితే బాబు సీఎం అయిన తర్వాత, ఆయన సెక్రటరీ ప్రద్యుమ్న, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నారు. వారు గతంలో పార్టీ ఆఫీసులో పనిచేసిన వారే. దానితో వారిద్దరినీ సీఎం మీడియా కోఆర్డినేటర్లుగా నియమిస్తూ, వారికి నెలకు 90 వేల రూపాయల జీతం నిర్ణయిస్తూ, తాజాగా ఇచ్చిన ఉత్తర్వు వివాదంగా మారింది.

నిజానికి ఇప్పటివరకూ సీఎంఓలో.. మీడియా కో ఆర్డినేటర్ అనే పోస్టు లేదు. సీఎంసీపీఆర్‌ఓ పోస్టు అనేది ఉన్నప్పటికీ, దానిని ఇంకా భర్తీ చేయలేదు. అసలు ప్రద్యుమ్న సృష్టించిన పోస్టుకు, క్యాబినెట్ ఆమోదం లేదంటున్నారు. ఇటీవల సీఎంఓలో 78 పోస్టులు భర్తీ చేసేందుకు, క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. చివరకు అందులో కూడా మీడియా కో ఆర్డినేటర్ల పోస్టు లేదంటున్నారు. నిజానికి ప్రభుత్వం మారిన తర్వాత, సీఎంఓలో పోస్టులన్నీ రద్దయిపోతాయి. మళ్లీ కొత్త సీఎంఓ, దాని ప్రాధాన్యతల మేరకు కొత్తవారిని నియమించుకుంటుంది.

కాగా జిఓ ఇచ్చిన తర్వాత ర్యాటిఫికేషన్ కోసం పంపించే ఈ వ్యవహారం.. మిగిలిన వారిపై పెను ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. 2019-2022 నాటి జిఓలు చూపించి, వీరిని నియమించినట్లు కనిపిస్తోంది. కాగా వీరిని తొలుత సమాచారశాఖలో తీసుకుని.. అక్కడి నుంచి జీతాలు తీసుకుని, తన వద్ద పనిచేయించుకునేందుకు, ప్రద్యుమ్న చేసిన ప్రయత్నం ఫలించలేదని తెలిసింది. సమాచారశాఖలో అంతేసి జీతాలివ్వడం సాధ్యపడదని.. సమాచారశాఖ డైరక్టర్ శుక్లా స్పష్టం చేయడంతో, ప్రద్యుమ్న తానే సొంతగా, లేని పోస్టులు సృష్టించి జీఓలిచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రద్యుమ్న నిర్వాకంతో.. ముఖ్యమంత్రి,మంత్రి ంటే ఒక సెక్రటరీ గొప్ప అనే భావన ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. ఓవైపు మూడునెలల నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దగ్గర పనిచేసే పీఆర్వోలకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు లేకుండా ఉన్న నేపథ్యంలో.. ఒక సెక్రటరీ తన వద్ద పనిచేసే అదే పీఆర్వోలకు ఏకంగా 90 వేల జీతం ఇవ్వడమే కాకుండా, సీఎం మీడియా కోఆర్డినేటర్లుగా నియమిస్తూ జీఓ ఇవ్వడమంటే.. ఇది సీఎం-మంత్రిని అవమానించడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అంటే రాష్ట్రాన్ని పాలించే ఒక సీఎం-మంత్రి చేయలేని పనిని, కేవలం ఒక సెక్రటరీ చేయగలిగినప్పుడు సీఎం-మంత్రి ఎందుకు చేయలేకపోయారు? మూడునెలల నుంచి వారు తమ వద్ద పనిచేస్తున్న పీఆర్వోలకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఎందుకు ఇప్పించలేకపోయారు? మరి ఆ ప్రకారంగా సీఎం గొప్పనా? ఆయన సెక్రటరీ గొప్పనా? ఇక సీఎం-మంత్రిని నమ్ముకునేదాని కన్నా, ఐఏఎస్‌లను నమ్ముకోవడమే మంచిదన్న సంకేతం ఇస్తున్నారా? అన్న చర్చ మొదలయింది.

ఇది సుదీర్ఘకాలం నుంచి సీఎం-మంత్రి వద్ద పనిచేసే ఉద్యోగులలో, తప్పుడు సేం తాలు వెళతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రద్యుమ్న అత్యుత్సాహంతో, ప్రస్తుతం ఎలాంటి అపాయింట్‌మెంట్ ఆర్డర్ లేకుండా సీఎం-మంత్రి లోకేష్ వద్ద పనిచేస్తున్న పీఆర్వోల ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అది వారి పనితీరుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

కాగా ప్రద్యుమ్న పనితీరుపై, గత మూడునెలల నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు బాబు సీఎం అయిన తర్వాత ఆయనను సీఎంఓలోకి తీసుకోవడంపైనే, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు కారాలు మిరియాలు నూరారు. కారణం.. ఆయన భార్య, వైసీపీ లీగల్‌సెల్‌లో చురుకుగా పనిచేయటమే. దానికి సంబంధించిన ఫొటోను జతపరిచి, సోషల్‌మీడియాలో కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే. దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన టీడీపీ సీనియర్లు.. అన్నీ తెలిసి ఆయనను సీఎంఓలోకి ఎలా తీసుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తర్వాత కొద్దికాలం క్రితం.. ప్రద్యుమ్న సంతకంతో, వైసీపీ నేతకు టీటీడీ లెటర్ సిఫార్సు చేసిన వైనంపైనా టీడీపీ సైనికులు సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. అది చాలాకాలం పాటు టీడీపీ వర్గాల్లో చర్చ అయింది.

జగన్ జమానాలో ఐఏఎస్‌ల అవినీతి-ఇష్టారాజ్యంపై టీడీపీ అనుకూల మీడియా వరస కథనాలు రాసింది. జగన్ ఐఏఎస్‌లను ఏవిధంగా వాడుకుంటున్నారో ఆ కథనాలు సవివరంగా వెల్లడించాయి. కీలకశాఖల్లో జరుగుతున్న అవినీతి-వాటికి కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్‌లపై విరుచుకుపడింది.

దానిపై ఐఏఎస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రద్యుమ్న నిప్పులు చెరిగారు. మీడియా తమపై దుష్ర్పచారం చేస్తోందని, తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని చెప్పారు.

ఇప్పుడు మళ్లీ సీఎంఓలో అసలు లేని పోస్టును సృష్టించి, తన వద్ద పనిచేసే వారికి ఉత్తర్వులివ్వడం కొత్త వివాదానికి దారితీసింది. మొత్తంగా సీఎం-మంత్రి చేయలేని పనిని.. సెక్రటరీ చేసి చూపించారన్న వ్యాఖ్యలకు ఆ జీఓ కారణమయింది.
cmo