భాగ్యనగర్ కార్యకర్తల ఆత్మీయత కట్టిపడేస్తుంది

– ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్

హైదరాబాద్: “భాగ్యనగర్ బీజేపీ కార్యకర్తల ఆత్మీయత మనసును కట్టిపడేస్తుంది.. ఇంతటి ఆత్మీయత, అభిమానం దేశంలో మరెక్కడా ఉండదు”అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు.

అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చే కార్యకర్తలకు తెలంగాణలో కొదువలేదన్నారు. ఎంత తక్కువమంది కార్యకర్తలను కలుద్దామనుకుంటే, అంత ఎక్కువమంది వస్తారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వాతావరణం దేశానికే ఆదర్శమని మంత్రి సంబరపడ్డారు.

ఆదివారం ఉదయం భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి, మిత్రుడు డాక్టర్ సోలంకి శ్రీనివాస్ ఇంట్లో ముఖ్యమైన పలువురు ప్రముఖులతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యారోగ్య మంత్రి పదవి బాధ్యతలు చేపట్టక భాగ్యనగర్ వచ్చిన సత్యకుమార్, కర్మాన్ ఘాట్ లోని సోలంకి ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం తిలకించి, కార్యకర్తలతో సరదగా గడిపారు.

మంత్రి సత్యన్న మాట్లాడుతూ.. భాగ్యనగర్ తనకు పుట్టిల్లు లాంటిదని, తన జీవితకాలంలో భాగ్యనగర్ లోనే ఎక్కువ కాలం గడిపానని, ఈ ప్రాంతానికి, తనకు అవినాభావ సంబంధం ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తాను చేపట్టిన మంత్రి పదవీబాధ్యతల్లో తలమునకలై ఉన్నందున ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని పేర్కొన్నారు.

“భాగ్యనగర్ వచ్చినపుడు ఒక చిన్న కార్యకర్త ఇంట్లో తేనీటి విందు ఏర్పాటు చేయాలని సోలంకి కి సూచించాను. అయితే ఇంత పెద్దనగరంలో నేనే అందరికంటే చిన్న కార్యకర్తను” అని సోలంకి చెప్పినట్లు చమత్కరించారు. కార్యకర్తలు కష్టపడి పార్టీ కోసం పని చేయాలని సత్యన్న సూచించారు.