రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం

Yanamala-Ramakrishnudu-2

– యనమల రామకృష్ణుడు

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అన్నారు. అనంతరం గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు.

నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని తెలిపారు.

మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి వల్లభనేని బాలశౌరి ని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.