పాలమూరులో ‘కారు’ కథ కంచికి

సీఎం సొంత జిల్లాలో ఖాళీ అయిన కారు

తెలంగాణలో రాజకీయం ముదురు పాకాన పడుతోంది. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఏడుగురు ఇప్పటికే కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ బాట పట్టారు. ఈ జంపింగ్ ల పర్వం ఇంకా సాగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు సాధించింది. వీటిలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోయింది. 38కి పరిమితం అయిన ఆ పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.

దీంతో బలం 31కి పడిపోయింది. జగిత్యాల, భద్రాలం, స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, గద్వాల, బాన్స్ వాడ, చేవెళ్ల ఎమ్మెల్యేలు కారుకు టాటా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ ఇదే ప్రయత్నంలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ బలం 80కి చేరుకోనుంది. సీఎం సొంత జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లో 14 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిలో 12 స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుంది. గద్వాల, అలంపూర్ లలో మాత్రమే ఓటమి పాలైంది.

అయితే, గద్వాల ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి గత వారం కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మిగిలింది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాత్రమే. అయితే, అలంపూర్ నుంచి ఎవరు గెలిచినా అందులో ప్రధాన పాత్ర మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు అయిన, చల్లా వెంకట్రామిరెడ్డిదే. 2004లో ఈ స్థానం జనరల్ గా ఉన్నప్పుడు చల్లా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో రిజర్వుడ్ అయినా చల్లాదే పట్టు. అయితే, రెండేళ్ల కిందట ఈయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆపై ఎమ్మెల్సీ కూడా అయ్యారు. గత ఎన్నికల్లో విజయుడి విజయంలో చల్లా పాత్ర ఉంది. కాగా, మూడు రోజుల కిందట వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ ను కలిశారు. ఆయన పార్టీ మారడం ఖాయం అంటున్నారు.

అదికూడా విజయుడితో కలిసే అని చెబుతున్నారు. 14 కు 14.. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో సీట్లున్న జిల్లా ఉమ్మడి పాలమూరు. ఇక్కడ 14 నియోజకవర్గాల్లో 12 కాంగ్రెస్ నెగ్గింది. గద్వాల, అలంపూర్ శాసన సభ్యులు కూడా చేరితే జిల్లా మొత్తం హస్తగతం అవుతుంది. గత ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ జిల్లాలోనూ స్వీప్ చేయలేదు. అత్యధిక స్థానాలు సాధించిన ఖమ్మంలో (కొత్తగూడెంలొ సీపీఐ అభ్యర్థి కూనంనేని, భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం నెగ్గారు). నల్లగొండలో జగదీశ్ రెడ్డి సూర్యపేట నుంచి గెలిచారు. అయితే, ఇప్పుడు పాలమూరు మాత్రం స్వీప్ అయి కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది.