– విజయసాయిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా?
– తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే విజయసాయిపై కుట్రకు ప్రాణం?
– ఎంపీలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకేనంటూ సోషల్‌మీడియాలో కథనాలు
– విజయసాయిపై ఆరోపణలను ఖండించని వైవి సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల
– జగన్ సహా అధికార ప్రతినిధుల మౌనవ్రతం వెనక వ్యూహమేమిటి?
– స్క్రీన్‌ప్లే స‘కళా’వల్లభుడిదేనా?
– ఐదేళ్ల నుంచీ వారిద్దరి మధ్య కోల్డ్‌వార్
– మీడియాకు పోటీలు పడి మరీ లీకులు ఇచ్చిన వైనం
– విజయసాయి డీఎన్‌ఏ టెస్టు కోసం కోర్టుకెక్కనున్న శాంతి భర్త మదన్
– తాడేపల్లి పోలీసులకు విజయసాయిపై మదన్ ఫిర్యాదు
– అంతకుముందు హోంమంత్రిని కలిసిన మదన్
– కొత్త మలుపు తిరిగిన విజయ‘శాంతి’ కథ
( మార్తి సుమ్రహ్మణ్యం)
వైసీపీలో మొన్నటివరకూ నెంబర్‌టూగా ఉన్న ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా? దానికి తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులున్నాయా? అందుకే అధినేత జగన్ సహా, వైవి సుబ్బారెడ్డి-మిథున్‌రెడ్డి-సజ్జల, అధికార ప్రతినిధులు వ్యూహాత్మకమౌన పాటిస్తున్నారా? చిన్న విమర్శలు- ఆరోపణలపైనే ఆకాశం చిల్లుపడేంత అరిచి గోలపెట్టే మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు.. విజయ‘శాంతి’ ఎపిసోడ్‌పై, నోటికి తాళాలేసుకోవడానికి కారణమేమిటి?
అసలు తాడేపల్లి ఆశీస్సులతోనే ఈ విజయ‘శాంతి’ కథ నడిపిస్తున్నది, అప్పటి సలహాదారైన సకల ‘కళా’ వల్లభుడేనా? అందుకు ఓ అదృశ్యశక్తి సహకరిస్తోందా? అసలు విజయసాయిని పార్టీ నుంచి పొమ్మనలేక, పొగబెట్టేందుకు రంగస్థలం సిద్ధమవుతోందా? అందుకే ఎవరూ ఆయనకు దన్నుగా నిలిచేందుకు భయపడుతున్నారా?… ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీలో ఒంటరివాడరయ్యారా? ఇదీ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్‌టాపిక్.
వేణుంబాక విజయసాయిరెడ్డి. ఇది ఏపీ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆయన సాగించిన హవా అది మరి. అప్పట్లో విశాఖలో ఆయన కత్తికి ఎదురులేదు. అయితే మధ్యలో ఆయన ప్రాధాన్యం తగ్గించడం-మళ్లీ కొనసాగించడం, ఇంకోసారి టచ్‌మీనాట్‌లా ఉంచడం, మరోసారి దూరంగా ఉన్న జిల్లాలకు పంపించడం లాంటివి చేసినా.. విజయసాయిరెడ్డి పడి.. లేస్తూనే ఉన్నారు. అలాంటి విజయసాయికి, అసిసెంట్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో అక్రమ సంబంధం ఉందంటూ.. స్వయంగా ఆమె భర్త మదన్మోహన్ తెరపైకొచ్చి చేసిన యాగీ, విజయిసాయి పరువును రోడ్డును పడేసింది.
తాజాగా శాంతిభర్త మదన్మోహన్ హోంమంత్రి అనితను కలసి తనకు న్యాయం చేయాలని కోరారు. మళ్లీ శుక్రవారం తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి, తన భార్య బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని ఫిర్యాదు చేశారు. వియసాయికి డీఎన్‌ఏ టెస్టు చేయించాలని తాను కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. అంటే నోడో-రేపో మదన్‌మోహన్ ఆపని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
అయితే తనపై వచ్చిన ఆరోపణలకు రెంరోజులు ఆలస్యంగా స్పందించి, తెరపైకి వచ్చిన విజయసాయి.. తన ప్రతిష్ఠను మంటగలుపుతున్న కొన్ని మీడియా సంస్థలపె,ై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రివిలేజ్ కమిటీ, మానవ హక్కుల కమిషన్, ఎస్సీఎస్టీ కమిషన్, ప్రెస్‌కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అందులో భాగంగా మహాన్యూస్ వంశీకి, తాజాగా పరువునష్టం దావా నోటీసు పంపి ఒక అడుగు ముందుకేశారు.
ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ.. వైసీపీలో 40 రోజుల వరకూ చక్రం తిప్పిన విజయసాయి సమస్యల్లో ఉంటే, జగన్ నుంచి ఒక్క అధికార ప్రతినిధి కూడా స్పందించకపోవడంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలు ఆయన పార్టీలో ఒంటరయ్యారన్న సంకేతాలు పంపిస్తున్నాయి. వైసీపీ కోసం.. జగన్ ఉన్నతి కోసం ఢిల్లీలో నానా అగచాట్లు పడి, విమర్శలు-ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయికి.. కనీసం జగన్ నుంచి కూడా మద్దతు లభించకపోవడమే రాజకీయవర్గాలను విస్మయపరుస్తోంది.
అయితే విజయసాయిరెడ్డికి పొగ పెట్టడానికి.. సహచర ఎంపీలతో కలసి బీజేపీలో చేరేందుకు వేసిన స్కెచ్, జగన్‌కు లీకవడమే ప్రధాన కారణమన్న కథనాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే విజయసాయిని తప్పించి, తన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డికి, రాజ్యసభ నాయకత్వం అప్పగించారన్నది సోషల్‌మీడియాలో కథనాల సారాంశం.
ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్‌ను.. జగన్‌కు దగ్గరైన నాటి సలహాదాయిన స‘కళా’వల్లభుడే, వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారన్నది అటు పార్టీ వర్గాలు-ఇటు సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ. గతంలో సీఎంఓపై ఓ మీడియా సంస్థలో వచ్చిన వరస కథనాల వెనుక.. ఒకసారి విజయసాయి-మరోసారి స‘కళా’వల్లభుడే కారణమని, అది ఆ ఇద్దరి మధ్య జరిగిన కోల్డ్‌వార్ ఫలితమేనన్నది అప్పట్లో జరిగిన మరో చర్చ. ఇప్పుడు విజయసాయిని బీజేపీ లింకు నుంచి కట్ చేసేందుకే, ఆయనపై అనైతిక ఆరోపణల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారంటున్నారు.
నిజానికి పార్టీ ఓడిన తర్వాత స్వయంగా జగనే.. తన రాజకీయ భవితవ్యం కోసం , తన పార్టీ ఎంపీలను బీజేపీలోకి పంపించేందుకు ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. అయితే దానికంటే ముందే విజయసాయి బీజేపీ నాయకత్వ, టచ్‌లోకి, తనతో సహా రాజ్యసభ ఎంపీలందరినీ.. బీజేపీలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారన్న కథనాలు, సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అది తెలిసిన తర్వాతనే జగన్.. తన పార్టీలో కీలకనేత విజయసాయిని, పక్కకు తప్పించడం ప్రారంభించారన్నది పార్టీవర్గాలు-సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ.
విజయ‘శాంతి’ ఎపిసోడ్ తెరపైకి రాకముందు, మాజీమంత్రులు రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి, టీడీపీ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. అయితే విజయసాయి ఎపిసోడ్ తెరపైకి వచ్చిన తర్వాత.. మాజీ మంత్రులు గానీ, అధికార ప్రతినిధులు గానీ విజయసాయి దన్నుకు రాకపోవడం ప్రస్తావనార్హం. పార్టీ ప్రెస్‌మీట్లలో ఎవరు ఏ అంశంపై మాట్లాడాలన్న అంశాన్ని, సహజంగా సజ్జల అనుమతితోనే నిర్ణయిస్తారు. అలాగని సజ్జల కూడా తన సహచర పార్టీ నేత విజయసాయికి మద్దుతుగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం. కనీసం జగన్ .. విజయసాయికి మద్దతుగా ట్వీట్ కూడా చేయకపోవడంపై పార్టీ వర్గాల్లో వ్సిస్మయం వ్యక్తమవుతోంది.