కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు
ఉపాధ్యాయ వర్గాల్లో పెద్దఎత్తున విమర్శలు
విజయవాడ: పాఠశాల వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని ఓ ఉపాధ్యా యుడిని సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ మొగల్రాజపురం బీఎస్‌ఆర్కే మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎల్.రమేష్ స్కూల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. దాంతో ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ఆయన మిస్ అవుతున్నారని భావించి ఆయనను వివరణ అడిగారు. అయితే తనకు కంటి సమస్య ఉందని మొబైల్ ఫోన్‌ను అదే పనిగా వాడవద్దని, ముఖ్యంగా వాట్సాప్ చూడవద్దని వైద్యుడు సూచించారని వివరణ ఇచ్చాడు. అయితే నోటి మాట చెల్లదని, వైద్యుడు ఇచ్చిన సూచనల డాక్యుమెంట్లు సమర్పించలేదన్న కారణంతో సస్పెండ్ చేశారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
వాట్సాప్ వాడకపోవడం తప్పు ఎలా అవుతుందని, అదేమీ నిర్బంధం కాదని చెబుతున్నాయి. అది ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన యాప్, ప్రభుత్వ అధికారిక సమాచార మార్గం కాదని గుర్తు చేస్తున్నారు. వాట్సాప్‌లు లేక ముందు కూడా స్కూళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టం. వాట్సాప్ ఉన్న వారికి ఆదేశాలు వాట్సాప్‌లో ఇచ్చి.. లేని వారికి మరో పద్ధతిలో సమాచారం ఇస్తే సరిపోయేదానికి ఇలా సస్పెండ్ వేటు వేయ డమేమిటని విమర్శిస్తున్నారు.