ప్రతిభ గల విద్యార్థుల కోసం ప్రపంచం చూస్తోంది

– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీ నరసింహ

గుంటూరు, మహానాడు: ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురు చూస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. ​శనివారం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. గ్రాడ్యుయేట్ల విజయాన్ని జరుపుకోవడానికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు రావడం చాలా గర్వంగా, ఆనందంగా ఉందన్నారు. మీరు డిగ్రీ పట్టాలతో అకాడెమియా సరిహద్దులను దాటి అడుగు పెట్టినప్పుడు వాస్తవ ప్రపంచం కొత్త సవాళ్లను అందిస్తుందని, అవి మీ విద్య సామర్థ్యాన్ని పరీక్షించే క్షణాలుగా మిగులుతాయన్నారు. అదే విధంగా మీకు మద్దతునిచ్చిన మీ కుటుంబం, మీ మార్గదర్శకులు, మీ తోటివారికి మీ కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

ఇంజనీర్‌ అవ్వడం అంటే చిన్న విషయం కాదన్నారు. మీరు ఎప్పుడు యథాతథ స్థితిని ప్రశ్నించడం నేర్చుకోవాలన్నారు. మన జీవితంలోని ప్రతి అంశం లోతైన విప్లవానికి లోనవుతోందన్నారు. ప్రతి మూలలో కొత్త ఆవిష్కరణలు వేళ్లూనుకుంటున్నాయి. మనం ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు సమాజంలోని వివిధ రంగాలలో సంభవించే విశేషమైన మార్పులను అభినందించాలి. ఉత్సుకత ఎక్కడికి దారితీస్తుందో దాన్ని అన్వేషించండి , ఈ అన్వేషణకు భారతదేశం కంటే మెరుగైన ప్రదేశం మరొకటి లేదని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించు కోవాలన్నారు. కొత్త పద్ధతులను అనుసరించడం వల్ల మరింత సులువుగా లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎప్పటి మాదిరిగానే మూస ధోరణిలో వెళ్లకుండా మార్పును స్వాగతించాలన్నారు.

​నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పట్టభద్రులవుతున్న మీరందరూ ప్రపంచంపై మీ ముద్ర వేయడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. నేటి స్నాతకోత్సవానికి అతిథులుగా హాజరైన వారందరూ ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏమి సాధించగలడు అనేదానికి ఉదాహరణలుగా తీసుకోవచ్చన్నారు. జస్టిస్‌ నరసింహ, వినేష్‌ ఫోగట్‌ కథలతో ప్రేరణ పొందాలన్నారు. కలలను సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్‌ పి.నాగభూషణ్‌ , రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, బోర్డు ఆఫ్‌ మేనేజిమెంట్‌ సభ్యులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.