జగన్‌ దృష్టిలో అభివృద్ధికి తావు లేదు…

అందుకే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు
ప్రవాసాంధ్రుల సహకారంతో మంచి చేస్తా
తెనాలి అపార్ట్‌మెంట్‌ వాసులతో పెమ్మసాని

తెనాలి, మహానాడు : తెనాలి చెంచుపేటలో నివసించి అపార్ట్‌మెంట్‌ వాసులతో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమసాని చంద్రశేఖర్‌, జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహ ర్‌ పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ జగన్‌ పరిపాలనలో రాష్ట్రంలో విచిత్ర స్థితి ఏర్పడిరది. జగన్‌ దృష్టిలో రోడ్లకు, వంతెనలకు, తాగునీళ్లకు చోటు లేదు. ప్రజల మౌలిక సదుపాయాలు అంటే తమకు సంబంధం లేదన్నట్టు ఈ వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందరిలాగే అవి చేస్తాను… నిర్మిస్తానని కబుర్లు చెప్పకూడదు. కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది. మనోహర్‌ నేతృత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం.

ఎన్నికలు వస్తుండగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో జగన్‌కే తెలియాలి. ఆ చట్టం అమల్లోకి వస్తే సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి వంటి వాళ్లు న్యాయమూర్తులుగా తయా రవుతారేమో? అందుకే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ యాక్టును వ్యతిరేకించాలని కోరారు. కిలారు రోశయ్య చేసిన అవినీతి వల్ల జగన్‌ ఏది చెప్తే అది చేయాల్సిన దుస్థితికి దిగజారారు. నేను, చంద్రబాబు, లోకేష్‌ ఉన్నంతవరకు ఈ అమరావతిని అడుగు కూడా కదిలించలేరు. నేను పల్నాడు ప్రాంతంలో పుట్టిన వాడిని. ఈ బెదిరింపులు, బాంబులు చూస్తూనే పెరిగాను. నేను కేవలం అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మాత్రమే నా సొంత గడ్డపై అడుగుపెట్టాను. గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాను. రాబోయే 30 ఏళ్లలో నా వల్ల ఈ ప్రాంతానికి మంచే జరుగుతుందని హామీ ఇచ్చారు.

తెనాలిలోనే ఉద్యోగావకాశాలు
నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ తెనాలికి సంపూర్ణంగా రక్షిత మంచినీటి పథకం అందించాలని నేను ఎమ్మెల్యే గా ఉండగా విజయవాడ నుంచి పైపులైన్లు వేశాం. రోజుకు 30 లక్షల లీటర్లు నీరు అందేలా అప్పట్లోనే ప్రణా ళికలు రచించాం. కానీ నేడు రోజుకు 12 లక్షల లీటర్లు కూడా అందడం లేదన్నారు. నేడు తెనాలి నుంచి విజయవాడ, గుంటూరుకు వెళ్లాలంటే ప్రయాణికుల, నడుములు విరిగిపోయే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. విద్యావంతులైన మన బిడ్డలు ఇకనుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లాల్సిన పనిలేదు. మన తెనాలిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.