ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు

– ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు

గుంటూరు, మహానాడు: ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని, స్వచ్ఛంద సేవా సంస్థల వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించగలిగితే గ్రామీణ ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరులోని ది విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మానవత, కొరిటాల ఇందిర శేషగిరిరావు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ది విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని శాఖలు ఈ కృషిని కొనసాగించాలన్నారు. గుంటూరు నగరంలో గల కొరిటెపాడులో ప్రజా ప్రయోజనర్థం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ సేవా రంగాల్లో ఉండాల్సిన విద్య, వైద్యం కార్పొరేటీకరనకు గురవ్వడం వల్ల పేదలు అప్పుల పాలవుతున్నారని, ఈ పరిస్థితుల్లో వైద్య శిబిరాల నిర్వహణతో ఊరట కలిగిస్తున్నాయన్నారు. బ్యాంకు మేనేజర్ కోటా బుల్లి కుమార్ మాట్లాడుతూ అతి తక్కువ వడ్డీ రేట్లతో విద్యా రుణాలు అందిస్తూ పేద ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నట్టు తెలిపారు. వైద్య శిబిరానికి డాక్టర్‌ పాటి బండ్ల శివాజీ, డాక్టర్‌ పి. ప్రసన్నకుమార్, డాక్టర్‌ ఎన్‌. వి. పద్మజ, శంకర్ కంటి ఆసుపత్రి సిబ్బంది హాజరై 150 మంది రోగులకు సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో కొరిటాల శేషగిరిరావు, ఇందిర, మానవత చైర్మన్ పావులూరి రమేష్, అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కె.సతీష్, టి.ధనంజయ రెడ్డి, బ్యాంక్ కమిటీ మెంబర్స్ కోట మాల్యాద్రి, ఎస్.లక్ష్మీ సుజాత, కె.రమణ బాబు, ఎన్ .సాంబశివరావు, వి.సుబ్రహ్మణ్యం, గురవా రెడ్డి, లక్ష్మీ సామ్రాజ్యం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.