Mahanaadu-Logo-PNG-Large

ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు, సిబ్బంది వైఖ‌రిలో మార్పు రావాలి

వైద్య సేవ‌ల కోసం ప్ర‌భుత్వాసుప‌త్రులు ప్ర‌జ‌ల మొద‌టి ఎంపిక‌గా మారాలి
ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ, సేవ‌ల నాణ్య‌త మెరుగుప‌డాలి
మార్పు కోసం స్వ‌ల్ప‌,మ‌ధ్య‌,దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలి
ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, స‌మ‌య పాల‌న, జ‌వాబుదారీ త‌నంతో ప్ర‌జ‌ల మెప్పు పొందవ‌చ్చు
గ‌త ఐదేళ్లుగా వైసిపి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో గాడిత‌ప్పిన ప్ర‌భుత్వాసుప‌త్రులు
రెండేళ్ల‌లో స‌మ‌గ్ర మార్పులు తెస్తామ‌న్న ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్
ప్ర‌భుత్వాసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌ల‌కు ఇక‌నుండి రేటింగ్
ఏడు గంట‌ల పాటు సాగిన స‌మీక్షా స‌మావేశం

అమ‌రావ‌తి: గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వాసుప‌త్రుల నిర్వ‌హ‌ణ స‌రిగా లేక‌పోవడంతో అనేక స‌మ‌స్య‌లు పేరుకుపోయాయ‌ని వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు సైతం ఆరోగ్య‌శ్రీ నిధులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలోని ప్ర‌భుత్వం బ‌కాయిప‌డ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని మంత్రి పేర్కొన్నారు.

మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్‌లో ఆయ‌న రాష్ట్రంలోని అన్ని గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు,ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో నెలకొన్న స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే దిశ‌గా ఈ స‌మాలోచ‌న స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వేలాది కోట్ల రూపాయ‌లు ఆరోగ్య శ్రీ నెట్వ‌క్క్ ఆసుప‌త్రుల‌కు బ‌కాయిప‌డిన వైసిపి ప్ర‌భుత్వం చివ‌రికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు కూడా బ‌కాయ‌ప‌డింద‌ని, ఒక్క విజ‌య‌వాడ జిజిహెచ్ కే రూ.23 కోట్ల రూపాయ‌లు బ‌కాయిప‌డింద‌ని మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌భుత్వాసుప‌త్రుల నిర్వ‌హ‌ణ, సేవ‌ల్లో ఎదుర‌వుతున్న లోటుపాట్లను స‌రిదిద్దాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని మంత్రి తెలిపారు.

వైఖ‌రి మారాలిః మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ముఖ్యంగా డాక్ట‌ర్లు త‌మ వ్య‌వ‌హార‌శైలిని మార్చుకోవాల‌ని, స‌మ‌య‌పాల‌న పాటించాల‌ని అన్నారు. న‌ర్సింగ్ సిబ్బందికి స‌రైన శిక్ష‌ణ కూడా అవ‌స‌రమ‌న్నారు. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు క్లినిక‌ల్ అటాచ్‌మెంట్ ఉన్న న‌ర్శింగ్‌, ఫార్మ‌సీ కాలేజీల విద్యార్థుల్ని ఓపీ సేవలు మెరుగుప‌ర్చ‌డంలో వినియోగించే దిశ‌గా ఈ స‌మావేశంలో చ‌ర్చించామ‌న్నారు.

అలాగే ప‌లు స్వ‌చ్చంద సేవా సంస్థ‌లు, ఇత‌ర సంస్థ‌ల సేవ‌ల్ని ప్ర‌భుత్వ వైద్య సేవ‌ల ప‌ట్ల రోగుల అభిప్రాయాన్ని తెలుసుకోవ‌డంలో భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని మంత్రి సూచించారు. అలాగే ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో కూడా ఆరోగ్య బీమా ఉన్న వారికి వైద్యం అందించే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు, సైనేజీ బోర్డులు లేక‌పోవ‌డం, శానిటేష‌న్ స‌రిగా లేక‌పోవ‌డం, చివ‌రికి బాత్రూంలు, టాయిలెట్ల నిర్వ‌హ‌ణ లేక‌పోవ‌డం, కొన్నిటికైతే త‌లుపులు కూడా లేక‌పోవ‌డం, విజ‌య‌వాడ‌, కాకినాడ‌, వైయ‌స్సార్ క‌డ‌ప ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో తాగునీటికి ఇబ్బందులు, తాగునీటిలో ఫ్లోరైడ్ ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌న్నారు. మాజీ సిఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వంత జిల్లా లోని క‌డ‌ప రిమ్స్ ఊరికి దూరంగా ఉండ‌డం వ‌ల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార‌ని మంత్రి స‌త్య‌కుమార్ అన్నారు.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో గ‌త ప్ర‌భుత్వం విఫ‌ల‌య‌మ‌య్యింద‌న్నారు. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ ఓ ల కొర‌త‌తో పాటు ఇత‌ర సిబ్బంది కొర‌త‌, కింది స్థాయిలో అవినీతి వంటి అంశాలు కూడా చ‌ర్చ‌కొచ్చాయ‌న్నారు. చేతులు త‌డిపితే త‌ప్ప స్స్రెచ‌ర్ కూడా క‌ద‌ల‌ని దుస్థితి నుండి రోగుల్ని కాపాడి మెరుగైన సేవ‌లందించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో మాట్లాడామ‌న్నారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు ముందుకేస్తోంద‌ని, గ‌త అనుభ‌వాల్ని దృష్టిలో ఉంచుకుని ఏర‌కమైన చ‌ర్య‌లు తీసుకుంటే రోగుల‌కు చేరువ‌వుతామ‌న్న దిశ‌గా ఈ స‌మాలోచ‌న స‌మావేశం చ‌ర్చించామ‌న్నారు.

ప్ర‌స్తుతం 54 మ‌హాప్ర‌స్థానం వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయ‌ని మ‌రో 30 వాహ‌నాల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అంగీక‌రించార‌ని మంత్రి తెలిపారు. కొన్ని ఆసుప‌త్రుల్లో ఎలక్ట్రిక‌ల్ స‌మ‌స్య‌లతో పాటు , యుపియ‌స్ , ఎసిల స‌మ‌స్య‌లు కూడా నెల‌కొన్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఎక్స్ రే, సిటి స్కాన్ యంత్రాలు లేక‌పోవ‌డం, ఉన్నా నిర్వ‌హ‌ణ స‌రిగాలేక‌పోవ‌డం వంటి స‌మస్య‌లు కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కొచ్చాయ‌న్నారు. మ‌రికొన్ని ఆసుప‌త్రుల్లో డ్రైనేజీ నిర్వ‌హ‌ణ స‌రిగా లేక‌పోవ‌డం కూడా దృష్టికి వ‌చ్చింద‌న్నారు.

ఓపీ రిజిస్ట్రేష‌న్ అర‌గంట‌లో జ‌ర‌గాలి

మేథోమ‌ధ‌న స‌మావేశంలో మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ఓపీలో రోజూ 2 వేల నుండి 3 వేల వ‌ర‌కు తాకిడి ఉంటోంద‌ని, కొన్ని సంద‌ర్భాల్లో 4 వేలు కూడా ఉంటోంద‌న్నారు. ఓపీ రిజిస్ట్రేష‌న్
ఆర గంట లోపే జ‌రిగేలా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు. ఉద‌యం ఏ డాక్ట‌రైతే ఓపీ చూస్తారో రిపోర్టులొచ్చాక మ‌ధ్యాహ్నం కూడా అదే డాక్ట‌ర్ రోగుల్ని చూసేలా విధానాన్ని రూపొందించాల‌న్నారు.

ఆసుప‌త్రుల సూప‌రింటెండెట్లు ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అధిగ‌మించి ప‌నిచేస్తున్నార‌ని, కొన్ని విజ‌య‌గాథ‌లు కూడా ఉన్నాయ‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఏ ర‌కమైన మార్పుల్ని తీసుకురాగ‌లం, ప్ర‌జ‌లు మ‌న గురించి ఏమ‌నుకుంటున్నారు, ప్ర‌జ‌ల నుండి గుర్తింపు ఎందుకు రావ‌డంలేదు, ప్ర‌భుత్వాసుప‌త్రుల్ని చివ‌రి ఆప్ష‌న్ గా ఎందుకు తీసుకుంటున్నారు వంటి అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌భుత్వ వైద్య సేవ‌ల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూల అభిప్రాయం ఏర్ప‌డేలా స్వ‌ల్ప , మ‌ధ్య‌, దీర్ఘ కాలిక ప్ర‌ణాళిక‌లు ర‌చించి అమ‌లు చేయాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశించారు. ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రులు అందిస్తున్న వివిధ ర‌కాల సేవ‌ల వివ‌రాల్ని మీడియాకు క్ర‌మం త‌ప్ప‌కుండా వివ‌రించాల‌ని మంత్రి సూచించారు.

ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానానికి భిన్నంగా ఆసుపత్రుల నిర్వ‌హ‌ణ, వైద్య సేవ‌లు అందించ‌డానికి న‌డుం క‌ట్టాల‌ని డాక్ట‌ర్ల‌కు మంత్రి పిలుపునిచ్చారు.

ఆసుప‌త్రుల లోప‌లా, బ‌య‌టా ప‌రిశుభ్రంగా ఉంచ‌డంపై ప్రత్యేక దృష్టిని సారించాల‌న్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్ని మొద‌టి ప్రాధాన్య‌తా ప్ర‌జ‌లు ఎంచుకునేలా సౌక‌ర్యాలు, సేవ‌ల్ని అందించాల‌న్నారు.

అందుకు ఏంచేయాలో త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని మంత్రి కోరారు. స‌మ‌యానికి డాక్ట‌ర్లు వ‌చ్చేలా ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. ఎంఆర్ ఐ , సిటి స్కాన్లు, వివిధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ప‌రిక‌రాలు నిత్యం స‌రిగా ప‌నిచేసే విధంగా చూడాల‌ని మంత్రి ఆదేశించారు.

ఫీడ్ బ్యాక్, రేటింగ్ కు చ‌ర్య‌లు

వైద్య సేవ‌ల్ని మెరుగుప‌ర్చే దిశ‌గా ప‌టిష్ట‌మైన ఫీడ్ బ్యాక్ విధానం ఉండాల‌న్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ఇన్ని మౌలిక స‌దుపాయాలున్నా ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ఎందుకు చేయ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నించారు. రోగులు సంతృప్తి చెందేలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ప‌ని విధానాన్ని మెరుగుప‌ర్చుకోవాల‌న్నారు. రాబోయే రెండేళ్ల‌లో ప్ర‌భుత్వాసుప‌త్రుల నిర్వ‌హ‌ణ, వైద్య సేవ‌ల నాణ్య‌త‌లో స‌మూల‌మైన మార్పుల్ని తీసుకొస్తామ‌న్నారు.

ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో సెక్యూరిటీ విధానాన్ని ప‌టిష్టంచేయాల‌న్నారు. పిల్ల‌ల్ని ఎత్తుకుపోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్తులో చోటుచేసుకోకుండా ఉండేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల విష‌యంలో ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా స‌హించేది లేద‌న్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వివిధ కేట‌గిరీల వారిగా వారివారి సేవ‌ల్ని గుర్తించేందుకు ప్రోత్సాహ‌కాలు, ప్ర‌శంస‌లు ఇవ్వ‌డం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపొచ్చ‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

వైద్య క‌ళాశాల‌ల ప్రిన్పిపాళ్లు, ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్ల ప‌నితీరును మ‌దింపు చేయ‌డానికి ప‌టిష్ట‌మైన విధానాన్ని రూపొందించాల‌ని, అదే రీతిన వివిధ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, ఆసుప‌త్రుల‌కు వివిధ అంశాల ప్రాతిప‌దిక‌న ప్ర‌తి ఏడాదీ రేటింగ్ ఇచ్చి పోటీత‌త్వాన్ని పెంపొందించాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ స్పెష‌ల్ చీప్ సెక్ర‌ట‌రీ ఎం.టి.కృష్ణ‌బాబు, కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మంజుల‌, ఎపిఎంఎస్ ఐడి మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌రియు ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓ డాక్ట‌ర్ జి.ల‌క్ష్మీశా, డిఎంఇ డాక్ట‌ర్ న‌ర్సింహం, రాష్ట్రంలోని అన్ని జిజిహెచ్‌ల మెడిక‌ల్ సూప‌రింటెండెంట్లు, మెడిక‌ల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు ఏడు గంట‌ల పాటు జ‌రిగిన మేథోమ‌ద‌న స‌మావేశంలో పాల్గొన్నారు.