Mahanaadu-Logo-PNG-Large

కాబోయే మంత్రులు వీరే?

కొలిక్కివచ్చిన క్యాబినెట్ కూర్పు?
– నేటి సాయంత్రానికి ఖరారు
– స్పీకర్‌గా కళా వెంకట్రావు?
– జనసేన క్యాబినెట్‌లో చేరకపోతే మరికొందరికి అవకాశం?
– ఎమ్మెల్సీలకు నో చాన్స్?
– బీజేపీకి రెండు మంత్రి పదవులు?
– సుజనా, సత్యకుమార్‌కు అవకాశం?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ పదవీ ప్రమాణానికి ముహుర్తం దగ్గరపడింది. ఆ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఢిల్లీలో ఎన్డీయేతో చర్చలు, కేంద్ర క్యాబినెట్‌పై కసరత్తుపై బిజీగా ఉన్న చంద్రబాబు.. ఇటీవల మృతి చెందిన ఈనాడు అధినేత రామోజీరావు భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు అక్కడ ఎక్కువ సమయం కేటాయించారు. ఈ మధ్యలోనే ఆయన క్యాబినెట్ కూర్పుపై కసరత్తు చేసినట్లు చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాల సమాచారం చంద్రబాబు నాయుడు కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.

కాగా కేంద్ర మంత్రివర్గానికి దూరంగా ఉన్న జనసేన.. అదే సిద్ధాంతంతో రాష్ట్ర మంత్రివర్గంలో చేరకూడదన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. పవన్ ప్రతిపక్షనేత పోషించేందుకే మొగ్గుచూపుతున్నట్లు కొద్దిరోజు నుంచి జనసైనికులలో చర్చ జరుగుతోంది. దానితో జనసేనకు ఇవ్వదలిచిన 3 మంత్రి పదవులు టీడీపీ కోటాకు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ చేరాలని నిర్ణయిస్తే, ఈ జాబితాలో ముగ్గురికి అవకాశం ఉండనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్త మంత్రులు బహుశా వీరే..
శ్రీకాకుళం జిల్లా: కూనరవికుమార్
విజయనగరం జిల్లా: గుమ్మడి సంధ్యారాణి
విశాఖపట్నం: అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్, వంగలపూడి అనిత
తూర్పు గోదావరి: జ్యోతుల నెహ్రు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి
పశ్చిమ గోదావరి జిల్లా: రఘురామకృష్ణంరాజు, రామానాయుడు, పితాని సత్యనారాయణ
కృష్ణాజిల్లా: కొల్లు రవీంద్ర, సుజనాచౌదరి (బీజేపీ), శ్రీరాంతాతయ్య
గుంటూరు జిల్లా: కన్నా లక్ష్మీనారాయణ, లోకేష్/సత్యప్రసాద్
ప్రకాశం జిల్లా: గొట్టిపాటి రవికుమార్, స్వామి
నెల్లూరు జిల్లా: సోమిరెడ్డి/ఆనం/కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
చిత్తూరు జిల్లా: అమర్‌నాధ్‌రెడ్డి/నల్లారి కిశోర్‌రెడ్డి
కడప జిల్లా: మాధవీరెడ్డి
కర్నూలు జిల్లా: కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎన్‌ఎండి ఫరూఖ్
అనంతపురం జిల్లా: సత్యకుమార్ యాదవ్( బీజేపీ), పయ్యావుల కేశవ్/కాలువ శ్రీనివాసులు/ సవిత

ఒకవేళ జనసేన క్యాబినెట్‌లో చేరితే, ఇందులో ముగ్గురికి అవకాశం రాకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కమ్మ, కాపు, వైశ్య, కాపు, తూర్పుకాపు, క్షత్రియ, శెట్టిబలిజ, గవర, కళింగ, మైనారిటీ, మాల, మాదిగ, గిరిజన వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. మూడు రాజధానులను వ్యతిరేకించిన ఉత్తరాంధ్రలోని మెజారిటీ కులాలయిన తూర్పుకాపు, కళింగ, గవరలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

కాగా స్పీకర్‌గా సీనియర్ నేత, తూర్పు కాపు వర్గానికి చెందిన మాజీ మంత్రి కళా వెంకట్రావు నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటం, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, సీనియారిటీ దృష్టిలో ఉంచుకుని కళా వెంకట్రావుకు స్పీకర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.