కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు

-పొరపొచ్చాలకు తావివ్వొద్దు 
-ఈ మైత్రి ఇలాగే కొనసాగాలి 
-జనసేన అధినేత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుని ఆత్మీయ సమావేశం

అమరావతి, మహానాడు : జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు వెళ్లిన పల్లా శ్రీనివాసరావుతో గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యం వల్లనే మోడీ ఆశీస్సుల తో ఏర్పాటైన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.  జన సైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన రణోత్సాహం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషి, భారతీయ జనతా పార్టీ అభిమానుల ఆదరణ సమిష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగేలా క్షేత్రస్థాయిలో చర్యలు ఉండాలని ఇరువురి నేతల ఆకాంక్షించారు. దీనికి అనుగుణమైన కార్యాచరణను నిరంతరం పర్యవేక్షణలో అనుసరించేలా చూడాలన్నారు. ఎక్కడైనా బేధాభిప్రాయాలు తలెత్తుతాయన్న సూచనలు కనిపించిన వెంటనే వాటిని సరిదిద్దే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం ద్వారా గత పాలనలో జరిగిన అరాచకాన్ని ప్రజలు మరింతగా అవగతం చేసుకునేలా వ్యవహరించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.