( టి. లక్ష్మీనారాయణ)
కృష్ణా డెల్టా వ్యవస్థలో అంతర్భాగమైన ఏలూరు కాలువను ఎనికేపాడు వద్ద బుడమేరు సొరంగ మార్గంలో దాటుతుంది. ఆ సొరంగ మార్గం సగానికి సగం మూసుకుపోయిందని, వరద ప్రవాహం ఏడెనిమిది వేల క్యూసెక్కులకు మించిలేదని ఒక ఇంజనీర్ నాకు చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూడాలనుకొన్నాను.
నేను, గోపాలకృష్ణగారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాం. బోటులో బుడమేరు వరద నీటిలో ఒక గట్టు నుండి మరొక గట్టు వరకు వెళ్ళాం. వరద నీరు చుట్టుముట్టి ఉండడంతో బుడమేరు సొరంగం మార్గం ద్వారా ఏలూరు కాలువను దాటే స్థలానికి వెళ్ళే అవకాశం ప్రస్తుతానికిలేదని స్థానికులు చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో వెనుదిరిగివచ్చేశాం.
బుడమేరు మళ్లింపు కాలువ / పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో విస్తరణ పనులను పూర్తి చేసి ఉంటే కవులూరు – శాంతిపురం గ్రామాల సమీపంలో ఆ కాలువకు గండ్లు పడకుండా నివారించి ఉండవచ్చు! విజయవాడకు వరద ముప్పు వాటిల్లేది కాదు.
బుడమేరు సహజ ప్రవాహ మార్గాన్ని, మరీ ప్రత్యేకంగా ప్రభుత్వం 2011లోనే రూపొందించి, పాక్షికంగా అమలు చేసిన ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు 50.60 కి.మీ. ఆధునికీకరణ పథకాన్ని అమలు చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అందులో భాగంగా మొదటి రీచ్ లో 62 మీటర్ల వెడల్పు – 4.063 – 4.761 మీ. లోతు, రెండవ రీచ్ లో 110 మీటర్లు వెడల్పు – 4.802 – 2.584 మీ. లోతు, మూడవ రీచ్ లో 180 మీటర్ల వెడల్పు – 2.620 మీ. లోతుతో వరద కాలువను కొల్లేరు సరస్సు వరకు విస్తరించి, బుడమేరు వరద ప్రవాహ మార్గం లో అడ్డంకులను తొలగించే మరమ్మతు పనులను వేసవి కాలంలోనే ప్రభుత్వం చేసి ఉంటే బుడమేరు వరద ముప్పు నుండి విజయవాడ నగర ప్రజలు రక్షించబడేవారు.