ఈ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండం

– కావాలంటే కాంగ్రెస్‌…వద్దంటే బీజేపీకి ఓటేయండి
– ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో మోదీ కుట్ర
– కాషాయ పార్టీ క‘మండల్‌’ ఉద్యమం
– డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఆదాని, ప్రధాని
– 14 మంది ప్రధానులు చేసిన అప్పుకంటే
– మోదీ ఒక్కడే పదేళ్లలో డబుల్‌ 113 లక్షల కోట్లు చేశాడు
– నల్లధనం తెస్తామని పది పైసలు కూడా తేలేదు
– దేవుడు పేరు చెప్పే అగరబత్తీలపైనా జీఎస్టీ వేశాడు
– 20 కోట్ల ఉద్యోగాలని చెప్పి 7 లక్షలే ఇచ్చాడు
– పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, కుట్రలపై రేవంత్‌రెడ్డి ఛార్జిషీట్‌

హైదరాబాద్‌, మహానాడు: గాంధీభవన్‌లో పదేళ్ల బీజేపీ పాలనలో వైఫల్యాలు, కుట్రలపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఛార్జిషీట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ పదేళ్లలో కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీ… పార్లమెంట్‌ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభు త్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది..చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతోంది. అగ్గి పెట్టె, సబ్బు బిల్ల, అగర్‌ బత్తీలపై కూడా జీఎస్టీ విధించారు.

దేశ ప్రజలపై రూ.168 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు. పదేళ్లలో రూ.113 లక్షల కోట్లు అప్పులు తెచ్చి భారతదేశాన్ని తాకట్టు పెట్టారు. 60 ఏళ్లు కాంగ్రెస్‌ కూడబెట్టిన ఆస్తులను మోదీ పదేళ్లలో కార్పొరేట్‌లకు కట్టబెట్టారు. 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కడే డబుల్‌ అప్పులు చేశాడు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేశాడు. పదేళ్ల మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తేలేదు. 55 రూపాయల పెట్రోల్‌ మోదీ వచ్చాక 110 చేశాడు. దేవుడి పేరు చెప్పే బీజేపీ అగరబత్తీలపై కూడా జీఎస్టీ వేశాడు. చిన్న పిల్లల పెన్సిల్‌, రబ్బర్‌లపై కూడా జీఎస్టీ వేశాడు. దేశాన్ని తప్పకుండా ఎక్స్‌ రే తీస్తాం.

రిజర్వేషన్ల రద్దు కోసం కుట్ర
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తోంది..రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా..ఆర్‌ఎస్సెస్‌ భావజాలాన్ని, విధానాన్ని బీజేపీ అమలు చేస్తోంది..ఆరెస్సెస్‌ ఆలోచన ను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోంది. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరెస్సెస్‌ కంకణం కట్టుకుంది. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్ల మెజారిటీ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. 2025లోగా రిజర్వేషన్లను రద్దు చేయాలనే విధానంతో ఆరెస్సెస్‌ ఉంది. మొండిగా వ్యవహరించి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. ఇందుకు 2/3వ వంతు మెజారిటీ సాధించాలని పన్నాగాలు పన్నుతున్నారు. జనాభా దామా షా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్‌ గాంధీ స్పష్టంగా ప్రకటించారు. అందుకే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది.

కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం.. ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతారు అనే బీజేపీ భయం. మండల్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్‌ ఉద్యమాన్ని తెచ్చింది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుంది. కొందరు స్థానిక రాజకీయాల కోసం రిజర్వే షన్లు తీసేయడానికి సిద్ధమైన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రిజర్వేషన్లు కావాలా? వద్దా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండం. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్లు కాంగ్రెస్‌కు, వద్దు అనేవాళ్లు బీజేపీకి ఓటేయండి. బీజేపీకి వేసే ప్రతిఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే.. వర్గీకరణ కోసం కొట్లాడిన వారు కూడా ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదు. రిజర్వేషన్లు వద్దు.. రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి మద్దతు ప్రకటించండి. తాత్కా లిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్‌ రిజర్వేషన్లు రద్దుపై జరుగుతాయని తెలిపారు. మోదీ దేశాన్ని మోసం చేశాడు. డబుల్‌ ఇంజిన్‌ అంటే ఆదాని, ప్రధాని. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది.