ఎన్నారై ఇన్వెస్టర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు
డల్లాస్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ ఎంఎస్ఎంఇ, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్ లో సోమవారం ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వెల్లడించారు. ఎన్ఆర్ఐ లు తగిన ప్రతిపాదనలతో రావాలని పిలుపు ఇచ్చారు. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, అనుమతులు వెంటనే ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు.
ఔత్సాహిక పెట్టుబడిదారులు తమ ప్రతిపాదనలతో ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగే రోజులకు ఈ ప్రభుత్వంలో కాలం చెల్లిందని చెప్పారు. ప్రభుత్వం రూపొందిస్తున్న యాప్ లో రిజిస్టరు అయిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులే వర్చువల్ కాల్స్ ద్వారా పెట్టుబడిదారులకు అందుబాటులోకి వస్తారని అన్నారు. వారితో టచ్ లో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని రకాల సహకారం అందిస్తారని వెల్లడించారు.
ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామం వంటిదని మంత్రి సూచించారు. రాష్ట్రంలో సంవత్సరానికి 50వేల మంది విద్యార్థులకు చివరి సెమిస్టర్ నుంచి ఐటీ శిక్షణలు కూడా అందివ్వబోతున్నామని ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. ఇందుకోసం ఐబిఎం ఇతర ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వ సహకారంతో కెపాసిటీ బిల్డింగ్ సెంటర్లు పెడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం అధ్యక్షత వహించారు. సుధీర్ చింతమనేని, కె.సి. చేకూరి, రవీంద్ర చిట్టూరి, వినోద్ ఉప్పు, సతీష్ కొమ్మన, కిషోర్ చలసాని, కృష్ణమోహన్ దాసరి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గుళ్లపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.